పోలీసులను షాక్‌కు గురి చేసిన 'బిక్షగాడు'

By సుభాష్  Published on  19 Jan 2020 8:08 AM GMT
పోలీసులను షాక్‌కు గురి చేసిన బిక్షగాడు

సుప్రసిద్ధ పూరీ జగన్నాధాలయం వద్ద ఓ యాచకుడికి, రిక్షా కార్మికుడికి మధ్య జరిగిన వివాదం బిచ్చగాడు సినిమాని కాస్త మార్పులతో కళ్ళముందుకు తెచ్చింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే..

పూరీ జగన్నాథాలయం వద్ద బిక్షగాడు, రిక్షా కార్మికుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవ కాస్త పోలీసు స్టేషన్‌కు చేరింది. గొడవలో ఇద్దరు గాయపడ్డారు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తిని లిఖితపూర్వకంగా లేఖ రాయాలని పోలీసులు సూచించారు. కంప్లైంట్ లెటర్ లేఖ చూసిన పోలీసులు ఖంగుతిన్నారు. ఎందుకంటే అది చక్కని ఇంగ్లిషులో రాసి ఉన్న ఆ ఉత్తరాన్ని, ఎదురుగా నిలుచుని ఉన్న యాచకుడిని అపనమ్మకంగా ఎగాదిగా చూశారు. ఆ తర్వాత ప్రశ్నల వర్షం కురిపించారు. చివరకు అతడిని ఒకప్పుడు మిల్టన్‌ కంపెనీలో ఇంజినీరుగా పనిచేసిన భువనేశ్వర్‌కు చెందిన గిరిజా శంకర్‌మిశ్రాగా గుర్తించారు. పోలీసు అధికారిగా పనిచేసిన ఆయన తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించారు. తల్లి కూడా కాలం చేశారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నతస్థానాల్లో ఉన్నారు. ఈ వివరాలన్నిటినీ యాచకుడిగా మారిన నాటి ఇంజినీరు నుంచి విన్న పోలీసులు ఆయన కుటుంబాన్ని వెతికే పనిలో పడ్డారు.

అయితే ఆయన మాత్రం తాను మానసిక ఇబ్బందుల వల్లే ఇల్లూ, ఉద్యోగం వదిలేసి ఎటెటో వెళ్లిపోయానన్నాడు. ఆకలిని తీర్చుకోవడానికి యాత్రా స్థలాల్లో యాచన చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవలే సొంతూరికి వచ్చాననీ, కుటుంబ సభ్యులెవరినీ కలుసుకోవాలని లేదని కూడా తెలిపారు.

Next Story