19 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు..!

By సుభాష్  Published on  16 Oct 2020 7:39 AM GMT
19 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు..!

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రమైన దెబ్బకొట్టింది. కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇక కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించగా, అన్ని రంగాలతో పాటు విద్యాసంస్థలు మూత పడ్డాయి. ఇక అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా దాదాపు అన్ని సంస్థలు తెరుచుకున్నా.. విద్యా సంస్థలు మాత్రం ఇంకా తెరుచుకోవడం లేదు. ఇక తాజాగా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను పునః ప్రారంభించాలని పంజాబ్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌ రాష్ట్రంలో ఈనెల 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ ఇందర్‌ సింగ్‌ తెలిపారు.

కంటైన్‌మెంట్‌ జోన్ల బయట ఉన్న పాఠశాలలను మాత్రమే తెరువడం జరుగుతుందని వివరించారు. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు తరగతులు ప్రారంభిస్తామని అన్నారు. విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలు తెరవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం పాటిస్తూ విద్యార్థులు, అధ్యాపకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అలాగే పాఠశాలలకు వచ్చే విద్యార్థులు పూర్తిగా దుస్తులు ధరించి రావాలని మంత్రి సూచించారు. 9 నుంచి 12 తరగతి విద్యార్థులకు కేవలం మూడు గంటల పాటు మాత్రమే పాఠశాలలను రెండు షిప్టుల పద్దతిలో నడుపుతామన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలోని విద్యార్థులు పాఠశాలలకు రావొద్దన్నారు. పాఠశాలల్లో మొత్తం శానిటైజేషన్‌ చేయాలని, అలాగే శానిటైజ్‌, థర్మల్‌ స్కానింగ్‌ అందుబాటులో ఉంచాలని సూచించారు.

Next Story