యువరాజ్‌ విఫలం.. పరుగు తేడాతో గెలిచిన పాంటింగ్‌ సేన

By Newsmeter.Network  Published on  9 Feb 2020 10:22 AM GMT
యువరాజ్‌ విఫలం.. పరుగు తేడాతో గెలిచిన పాంటింగ్‌ సేన

టీమిండియా ఆల్ రౌండర్‌ యువరాజ్‌ సింగ్ విఫలమయ్యాడు. 2 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. బ్యాటింగ్‌ లో విఫలమైన యూవీ బౌలింగ్‌లో మాత్రం ఓ వికెట్ తీశాడు. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల సహాయార్థం మెల్‌బోర్న్ క్రికెట్‌ మైదానంలో గిల్‌క్రిస్ట్‌ ఎలెవన్‌×పాంటింగ్ ఎలెవన్‌ బుష్‌ఫైర్‌ బాష్‌ ఛారిటీ మ్యాచ్‌ జరిగింది. మాజీ దిగ్గజ ఆటగాళ్లంతా ఈ మ్యాచ్‌లో ఆడి అభిమానులను అలరించారు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టినా ఎంతో ఉత్సాహంగా ఆడారు. కాగా.. గిల్‌క్రిస్ట్‌ ఎలెవన్‌పై పాంటింగ్ ఎలెవన్‌ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

పది ఓవర్ల మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన పాంటింగ్‌ జట్టు నిర్ణీత ఐదు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. పాంటింగ్ (26, 14 బంతుల్లో; 4పోర్లు), లారా (30, 11 బంతుల్లో 3పోర్లు,2సిక్సర్లు) రాణించగా.. గిల్లీ జట్టులో వాల్ష్‌, సైమండ్స్‌, యువరాజ్‌ తలో వికెట్‌ తీశారు. 105 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గిల్లీసేన ఆరు వికెట్లు కోల్పోయి 103 పరుగులే చేసింది. షేన్‌ వాట్సన్‌ (30, 9 బంతుల్లో, 2పోర్లు,3సిక్సర్లు), సైమండ్స్‌ (29, 13 బంతుల్లో; 3పోర్లు,2సిక్సర్లు), గిల్లీ (17,11 బంతుల్లో 2పోర్లు,1సిక్సర్‌) రాణించారు. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా 3 పరుగులే రావడంతో ఒక్కపరుగు తేడాతో ఓడిపోయారు. యువీ (2) నిరాశపరిచాడు. పాంటింగ్‌ ఎలెవన్‌ బౌలర్లలో బ్రిట్‌ లీ రెండు, హోడ్జ్‌ ఒక్క వికెట్ తీశారు.

బ్రెట్‌లీ వర్సెస్‌ యువీ..

గిల్‌క్రిస్ట్‌ ఎలెవన్ తరుపున ఆడిన యువరాజ్‌ నిరాశపరిచారు. 6 బంతులు ఎదుర్కొని 2 పరుగులే చేశాడు. నిన్న ఓ అభిమాని.. బ్రెట్‌లీ రేపు 150కిమీల వేగంతో బంతులేస్తే ఏమౌంతుందని యువీని ప్రశ్నించగా… తనదైన శైలిలో యువరాజ్‌ సమాధానమిచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రెట్‌లీ 150కిమీల వేగంతో బంతులు వేస్తాడని అనుకోవడం లేదన్నాడు. మహా అయితే 130-135కిమీల వేగంతో వేయవచ్చునని.. ఒకవేళ 150కిమీల వేగంతో వేస్తే .. నేను నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్ ఉంటా అని యువీ ఫన్నీగా జవాభిచ్చాడు. ఆ అభిమాని అన్నట్లుగా బ్రెట్‌లీ బౌలింగ్‌ లోనే యువీ ఔటయ్యాడు.

Next Story