రాజకీయ నాయకులకు పబ్లిసిటీ ఆక్సిజన్ లాంటిది. దాని కోసం ఏమైనా చేయగలరు. మూత్రం చేసిన మురికి పిల్లను ముద్దు పెట్టగలరు…. చీమిడి ముక్కు బాబును చేరదీయగలరు…. ఇంకా ఇంకా ఏదేదైనా చేయగలరు. పబ్లిసిటీయే పరమావధి మరి. పాపం గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన ప్రియాంకా వాద్రా పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ పాపం ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇబ్బందికరంగా పరిణమించింది.

ఇటీవల లక్నోలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు వెళ్లిన ప్రియాంక కాసింత పబ్లిసిటీ కోసం కార్లు బోలెడు ఉన్నా స్కూటరైతేనే బాగుంటుందని దానిని ఎక్కింది. ఆమె నడిపించలేదండోయ్. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ వ్యవహారాల కో ఇన్ చార్జి ధీరజ్ గుర్జర్ అనే నాయకుడు స్కూటర్ నడిపించారు. ఆమె వెనక కూర్చున్నారు. అయితే ఆ స్కూటర్ వారిది కాదు. రాజ్ దీప్ సింగ్ అనే మరో నాయకుడిది.

ప్రియాంకా వాద్రాను మోసుకెళ్తున్న బండికి నంబర్ ప్లేటు సరైనది కాదు. ఆమెను తీసుకెళ్తున్న వ్యక్తికి లైసెన్సు లేదు. అంతే కాదు… గుర్జర్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన హెల్మెట్ ను కూడా పెట్టుకోలేదు. అంతేనా అంటే ఇంకా ఉందండీ…. స్కూటర్ రెడ్ లైట్ సిగ్నల్స్ ను పట్టించుకోలేదు. ట్రాఫిక్ నియమాలను పాటించలేదు. రాంగ్ రూట్ లో రయ్యిమంది. ఇలా లక్నో నగరంలో రోడ్ల మీద తిరిగే సరికి ప్రియాంకా వాద్రా, గుర్జర్ల ఫోటోలు మీడియా అంతటా తెగ ప్రచారమైపోయాయి. ఎక్కడ చూసినా కారు వదిలి స్కూటర్ లో ప్రియాంక పయనం గురించి “రోమన్ హాలీడే” స్థాయి కథనాలు వచ్చేశాయి. కానీ ఆ తరువాతే మొదలైంది అసలు కథ. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ట్రాఫిక్ మానేజ్ మెంట్ సిస్టమ్ వారి ఫోటోలు తీసింది. అవి పోలీసు అధికారులకు చేరాయి. వారు ఇప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినందుకు గుర్జర్ కి జరిమానా చాలాన్లు పంపించారు. తప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నందుకు రాజ్ దీప్ సింగ్ కు కూడా రూ. 6,100 జరిమానా విధించారు. దీంతో ఇప్పుడు ఇద్దరు నేతలూ లబోదిబోమంటున్నారు.

ప్రియాంక మాత్రం “కాదేదీ పబ్లిసిటీకి అనర్హం” అనుకుని బిజెపి కావాలనే తనను వేధిస్తోందని వాదిస్తున్నారు. అయితే “చట్టం ముందు అందరూ సమానులే” అని ప్రభుత్వం కూడా కాస్త గట్టిగానే వాదిస్తోంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.