పరవళ్లు తొక్కుతున్న ప్రకాశం బ్యారేజీ.. 70 గేట్ల ఎత్తివేత

By సుభాష్  Published on  23 Aug 2020 5:25 AM GMT
పరవళ్లు తొక్కుతున్న ప్రకాశం బ్యారేజీ.. 70 గేట్ల ఎత్తివేత

ప్రకాశం బ్యారేజీ నీటితో పరువళ్లు తొక్కుతోంది. బ్యారేజీలోకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు 70 గేట్లను ఎత్తి నీటిని దిగువన వదులుతున్నారు. బ్యారేజీలోకి ఇన్‌ప్లో 3,13,834 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,01,057 క్యూసెక్కులు ఉంది. 12 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టంతో బ్యారేజ్‌ నిండుకుండలా కళకళలాడుతోంది. ఈస్టర్న్‌, వెస్టన్‌ కెనాల్స్‌ ద్వారా 10,356 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. భారీగా నీటిని వదలడంతో అధికారులు నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు.

కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నది పరివాహక ప్రాంతాలైన రణదివినగర్‌, తారకరామనగర్‌, భూపేష్‌ గుప్తా నగర్‌, విద్యాదపురం తదితర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల ప్రజలు పునరావాన కేంద్రాలకు తరలివెళ్లాలని నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ కోరారు. నగరపాక సంస్థ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను సైతం ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు: 0866-2424172 0866-2422515.

కాగా, మరోవైపు బంగాళాఖాతంలో ఆగస్టు 23వ తేదీన మరోసారి అల్పపీడనం ఏర్పడనుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉండిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని ఇళ్లు, ఆలయాలు పూర్తిగా ముటమునిగిపోయాయి. భారీ వరదలతో ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు.

Next Story
Share it