మరో వివాదంలో ప్రకాష్ రాజ్...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 7:37 AM GMT
మరో వివాదంలో ప్రకాష్ రాజ్...!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పాత్ర ఏదైనా స‌రే... అద్భుతంగా న‌టించి ఆ పాత్ర‌కే వ‌న్నె తెస్తారు. అందుక‌నే అవ‌కాశాలు అత‌న్ని వెతుక్కుంటూ వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఎన్నో విభిన్న పాత్ర‌లు పోషించి..ఆయన బ‌హుభాషా న‌టుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే... అప్పుడ‌ప్పుడు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో..ఈ మధ్య వార్త‌ల్లో నిలుస్తున్నాడు.

తాజాగా ప్ర‌కాష్ రాజ్ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌దం అయ్యాయి. దీంతో ప్రకాష్‌ రాజ్‌ను సినిమాల నుంచి బహిష్కరించాలని కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు నమోదైంది. హిందూ దేవుళ్లు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారని, ప్రకాష్‌ రాజ్‌కు సినిమాల్లో అవకాశాలు ఇవ్వవద్దని అఖిల భారత హిందూ మహాసభా వేదిక ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనను కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని, ఆయనకు కన్నడ సినిమాల్లో అవకాశం కల్పించరాదని, ఒకవేళ ఇస్తే.. తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హిందూ మహాసభ వేదిక హెచ్చరించింది.

ఇంత‌కీ వివాదం ఏంటంటే...

ఇటీవ‌ల బెంగుళూరులోని ఒక ప్రైవేటు వార్తా ఛాన‌ల్‌ చర్చలో పాల్గొన్న ప్రకాష్‌ రాజ్‌... ఈ వివాదానికి తెర తీశారు. అయితే ఉత్తర ప్రదేశ్‌లో రథోత్సవానికి ముంబై నుంచి హెలికాప్టర్ల ద్వారా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ మోడళ్లను పిలిపిస్తున్నారని... అంతే కాకుండా మేకప్‌ చేసి ఆ మోడళ్లతో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడి వేషాలు వేయిస్తున్నారని, వారికి ఘనంగా పూల స్వాగతం పలుకుతున్నారన్నారని ఆరోపించారు. ఐఏఎస్‌ అధికారులు వారికి నమస్కరిస్తున్నారని, ఈ విధమైన చర్యలు దేశానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. వేడుక‌ల పేరుతో మైనార్టీల‌ను భ‌య‌పెట్టేలా ఇలాంటి స‌న్నివేశాల‌ను సృష్టించ‌డం ఏంటి అని ప్ర‌శ్నించారు. దీంతో వివాదం మొద‌లైంది. మ‌రి.. ముదురుతున్న ఈ వివాదం పై ప్ర‌కాష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story