మీ సౌకర్యాలు..మేము కడుతున్న పన్నులు : నటుడు ప్రకాష్ రాజ్

By రాణి  Published on  20 Jan 2020 1:24 PM GMT
మీ సౌకర్యాలు..మేము కడుతున్న పన్నులు : నటుడు ప్రకాష్ రాజ్

మనల్ని డిగ్రీ పత్రాలు చూపించమని అడుగుతున్న వారి వద్ద డిగ్రీ ఉంది తప్ప...అది నిరూపించుకునే పత్రాలు లేవని సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై పరోక్ష విమర్శలు చేశారు. ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ..కనీసం డిగ్రీ పత్రాలు చూపించలేని వ్యక్తులు పరీక్షా పే చర్చ కార్యక్రమాలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. మన ప్రధాని వద్ద పొలిటికల్ సైన్స్ డిగ్రీ ఉంది కానీ రుజువు పత్రాలు లేవని విమర్శలు చేశారు. అసలు పొలిటికల్ సైన్స్ అంటే ఏంటో ఇప్పుడు దేశ యువత మొత్తం చూపిస్తోందన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తన డిగ్రీకి సంబంధించిన పత్రాలను చూపించనట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు.

మనం కట్టే పన్నులతో బ్రతుకుతున్న ప్రభుత్వాలు..తిరిగి మనకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. మీరు వేసుకొనే సూట్, మీరు తాగే టీ, మీ సెక్యూరిటీ...మీరు అనుభవించే ప్రతిదీ మేము కట్టిన పన్ను రూపంలోనే మీకు అందుతుందన్నారు. ప్రజలు పన్నులు కట్టడం మానేస్తే దేశంలో ఉన్న ఏ ఒక్క రాజకీయ నాయకుడికి తినేందుకు తిండి కూడా దొరకదని హితవు పలికారు. రూ.350 కోట్ల విలువైన విగ్రహాలు మాకు అక్కర్లేదు కానీ..దేశంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో ?నిరక్షరాస్యులు ఎందరున్నారో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ వల్ల అస్సాంలో ఏం జరిగిందో..అందరికీ తెలుసన్నారు. ఓట్లు అడిగేది ఈ దేశ ప్రజలను కాదా ?.. అక్కడున్నది ఈ దేశ పౌరులు కాదా ? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇది నిశ్శబ్దంగా ఉండాల్సిన సమయం కాదని, ప్రశ్నించాల్సిన సమయమని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు. జర్మనీలో హిట్లర్ ఏం చేశారో..ఇక్కడ కూడా అదే జరుగుతుందన్నారు. CAA, NRC దేశ రాజ్యాంగ నిబంధనలకు లోబడి లేవన్నారు.

ఎన్ని తూటాలు పేల్చినా ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా నిరసనలు తెలుపుతామన్నారు. అస్సాంలో 19 లక్షల మందికి సిటిజన్ షిప్ మెంబర్ షిప్ లేదని, అలాగే కాశ్మీర్ లో వీఐపీలకు మెంబర్ షిప్ లేదని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. వీఐపీలకు మెంబర్ షిప్ లేనపుడు సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రధానీ మోదీ సీఏఏ పై పెట్టిన దృష్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంపై పెట్టి ఉండే దేశం బాగుపడేదన్నారు. ఏదేమైనా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికి హానికరమే తప్ప..ఉపయోగపడేవి కాదన్నారు.

Next Story