మున్సిపోల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు
By రాణి Published on 22 Jan 2020 1:48 PM ISTతెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు ప్రశ్నించే గొంతును గెలిపించే ఎన్నికలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సగానికి పైగా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్లు 'హస్త' గతం కాబోతున్నాయన్నారు. ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోమటిరెడ్డి కోరారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన భార్య, కుమార్తెలతో కలిసి నల్గొండ మున్సిపాలిటీ 33వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే నల్గొండ ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భార్య మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ..మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. పేరుకే వైన్స్, బార్లను మూసివేశారు గానీ..ఎన్నికల సమయంలో మద్యం ఏరులై పారుతుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి షబ్బీర్ అలీ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 48వ వార్డు 125వ పోలింగ్ బూత్ లో ఆయన ఓటర్లతో పాటు క్యూ లైన్లలో నిల్చుని ఓటు వేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపాలిటీలో ఒక్కొక్క వ్యక్తికి రెండు, మూడు ఓట్లు సృష్టించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చాలా వరకూ బోగస్ ఓట్లు ఉన్నాయని తాను ముందే చెప్పానన్నారు. డబుల్ ఓట్లు వేస్తే చర్యలు తీసుకుంటామని ఈసీ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనను మూడ్రోజుల ముందే చేయాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
మంత్రి జగధీష్ రెడ్డి బుధవారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 44వ వార్డు 136 పోలింగ్ బూత్‌లో సతీమణి సునీతతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ర్ట ప్రజలంతా కేసీఆర్ పక్షానే ఉన్నారని, మున్సిపోల్ లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన ఎలా ఉందో..పోలింగ్ బూత్ లకు ఓటు వేసేందుకు వచ్చే ఓటర్ల చిరునవ్వుల్లో కనిపిస్తోందన్నారు. అలాగే ముఖ్యమంత్రి చేపట్టిన పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్న పరిగి మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. పరిగి మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డాక తొలిసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 15 వార్డులకు గాను 30 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు అధికారులు.