రాజకీయ బేతాళం:వై.ఎస్.వివేకానంద హత్య కు సుపారీ ఇచ్చిందెవరు?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2019 2:49 PM GMT
రాజకీయ బేతాళం:వై.ఎస్.వివేకానంద హత్య కు సుపారీ ఇచ్చిందెవరు?

పట్టువదలని విక్రమార్కుడు దీర్ఘ ఆలోచనలో శ్మశానం వైపు సాగుతున్నాడు. విక్రమార్కుని అల్లంత దూరాన్నుంచే గమనించిన బేతాళుడు వికటాట్టహాసం చేసి.."ఏంటి విక్రమార్కా ఏంటి అంత ఆలోచనలో పడ్డావు? ఏంటి సంగతి? ఏ రాజకీయ పార్టీలో అయినా చేరదామనుకుంటున్నావా ఏంటి? "అని వెటకారమాడాడు. విక్రమార్కుడు ఆలోచనల్లోంచి బయటపడి "అదేం లేదు బేతాళా "అని చిన్నగా నవ్వాడు. "మరింక ఆలస్యం ఎందుకు..నన్ను చెట్టుమీంచి దించి భుజాలకెత్తుకుంటే కథ మొదలు పెట్టేస్తాను" అన్నాడు బేతాళుడు.విక్రమార్కుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బేతాళుని భుజాలకెత్తుకుని ముందుకు కదిలాడు.

" విక్రమార్కా ఈ రోజున చాలా భయంకరమైన..కథ చెబుతాను. భయంకరమైనదే కాదు..చాలా ఆసక్తికరమైనది కూడా." అన్నాడు. విక్రమార్కుడు కొంచెం చికాగ్గా మొహం పెట్టి... టీవీల్లో న్యూస్ స్టోరీస్ ని ప్రమోట్ చేసుకనే ప్రోమోలు చూసి చూసి చికాగ్గా ఉంది...నువ్వు కూడా ప్రోమోలు మొదలెట్టావేంటి?" అని సెటైర్ వేశాడు. బేతాళుడు ఒక్క క్షణ చిన్నబుచ్చుకుని కథ మొదలు పెట్టాడు. "విక్రమార్కా...ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి...టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరులో తమ పార్టీ నేతల మీటింగ్ లో మాట్లాడుతూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత...ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న అయిన వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డిని సుపారీ ఇచ్చి హత్య చేయించినా ఇంత వరకు విచారణకు దిక్కులేకుండా పోయిందని చంద్రబాబు ఆరోపించారు.

ఇప్పుడే కాదు.. వివేకానంద రెడ్డి ఈ ఏడాది మార్చి 15న దారుణ హత్యకు గురైన వెను వెంటనే..పోలీసుల దర్యాప్తు కూడా ప్రారంభం కాకుండానే... చంద్రబాబు నాయుడు హత్యానేరాన్ని జగన్ మోహన్ రెడ్డిపైకి నెట్టివేస్తూ ఆరోపణలు చేశారు. ఆ వెంటనే ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు నాయుడు ప్రతీ సభలోనూ వై.ఎస్.వివేకానంద రెడ్డిని కుటుంబ సభ్యులే హత్య చేయించారని ప్రచారం చేశారు. చంద్రబాబు తో పాటు టిడిపి నేతలు..టిడిపితో రహస్య పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య జరిగితే జగన్ మోహన్ రెడ్డి ఏం మాట్లాడ్డం లేదని అన్నారు. ఎన్నికలైపోయాయి ఇపుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డి హత్య పై జగన్ మోహన్ రెడ్డిపైనే ఆరోపణలు చేస్తున్నారు. అసలు వివేకానంద రెడ్డి హత్య వెనుక ఎవరున్నారనుకోవాలి? చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? వీటికి సమాధానాలు తెలిసీ కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి చెక్కలైపోతుంది" అని బేతాళుడు ముగించాడు.

విక్రమార్కుడు లిప్త పాటు ఆలోచించి చేతిలోని కత్తిని ఒరలో పెట్టి చెప్పడం ఆరంభించాడు. "బేతాళా...చంద్రబాబు నాయుడి ఎత్తులు..ఆయన ఆలోచనలు..మాయలు ... మీ బేతాళ మాయలకన్నా చిత్రమైనవి. మీ దెయ్యాలు ,భూతాల ఆలోచనల కన్నా వికృతమైనవీ..భయంకరమైనవీ కూడా.వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య ఎప్పుడు జరిగింది బేతాళా? ఆ హత్య జరిగినపుడు ఏపీకి ముఖ్యమంత్రి చంద్రబాబే కదా. ఆ హత్య కూడా ఎప్పుడు జరిగింది బేతాళా? వై.ఎస్.ఆర్.కడప జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లోనూ వివేకానంద రెడ్డి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ దూసుకుపోతున్న తరుణంలోనే హత్యం జరిగింది. అంటే దానర్ధం ఏంటి బేతాళా? వివేకానంద రెడ్డిని రాజకీయ ప్రత్యర్ధులే హత్య చేయించారన్నది మెడకాయమీద తలకాయ ఉన్నవాళ్లెవరైనా చెప్పేస్తారు.

ఇక చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్పినట్లుగా వివేకానంద రెడ్డిని హతమార్చడానికి సుపారీ ఇచ్చిందే నిజమైతే..ఆ సుపారీ ఎవరు ఇచ్చారు? టిడిపి నేతలే ఇచ్చారా? చంద్రబాబు నాయుడికి తెలిసే సుపారీ ఇచ్చారా? లేక చంద్రబాబు నాయుడే సుపారీ ఇచ్చారా? సుపారీ తోనే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని చంద్రబాబుకు అనుకూల మీడియాలో కథనాలొస్తే..అవి తప్పుడు కథనాలని పోలీసు బాసే స్పష్టం చేశారు కదా. ఆ తర్వాతి రోజున కూడా చంద్రబాబు దాన్ని సుపారీ హత్య అన్నారంటే..సుపారీ ఇచ్చిందెవరో..ఎవరికి ఇచ్చారో..ఎంత సుపారీ ఇచ్చారో చంద్రబాబుకు తెలిసి ఉండాలి . ఒక వేళ చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లుగానే వై.ఎస్.వివేకానందను ఆయన కుటుంబ సభ్యులే సుపారీ ఇచ్చి హత్య చేయించి ఉంటే.. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వారిని ఎందుకు బోనులో నిలబెట్టలేదు?

ఎందుకు వారిని అరెస్ట్ చేయించలేదు? వివేకానంద హంతకులెవరో ...సూత్రధారులెవరో తనకు తెలుసునని మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు అసలు హంతకులను ఎందుకు పట్టుకోలేదు?

ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలిప్పుడు. ఒక వేళ హంతకులెవరో..సూత్రధారులెవరో చంద్రబాబుకు తెలిసినా అరెస్ట్ చేయించలేదంటే వారు టిడిపి కి కావాల్సిన వారా అన్నది కూడా తేలాలి. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఆరోపిస్తున్నది కూడా అదే బేతాళా. అందు చేత ఎన్నికల ప్రచారంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చంద్రబాబు నాయుడు వివేకా హత్య ఘటనను వాడుకున్నారు. లాభం లేకపోయింది. ఇపుడు మళ్లీ ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికే ఆయన ఈ అస్త్రాన్ని అందుకుని ఉంటారు" అని విక్రమార్కుడు ముగించాడు.

విక్రమార్కుడి సమాధానం విన్న బేతాళుడు కొంచెం భయంగా నవ్వి..విక్రమార్కా నువ్వు చెప్పినట్లు మా దెయ్యాల కన్నా కౄరంగా ఆలోచించగలిగే నేతలు కూడా ఉన్నారన్నమాట అని విక్రమార్కుడి భుజం మీంచి మాయమై చెట్టుకు వేలాడాడు.

-వీర పిశాచి

Next Story