గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో భారీ అవినీతి..!
By Newsmeter.Network Published on 2 Dec 2019 6:25 PM ISTఢిల్లీ: గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌పై చాలా అవినీతి జరిగిందన్నారు జల శక్తి మంత్రి రతన్‌లాల్ కటారియా. పోలవరం ప్రాజెక్ట్‌పై కాంట్రాక్టర్లకు అప్పటి ప్రభుత్వం రూ. 2346 కోట్ల అదనంగా చెల్లించినట్లు.. మంత్రి వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు, విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. ప్రాజెక్ట్ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపుల వ్యవహారంపై.. నియమించిన నిపుణుల సంఘం దీనిపై విచారణ జరిపి జూలై 2019లో నివేదికను కేంద్ర జల సంఘానికి తెలిపినట్లు ఆయన చెప్పారు.
ఈ నివేదిక ప్రకారం 2015-16 సంవత్సరంలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివిధ పనుల నిమిత్తం కాంట్రాక్టర్లతో కుదిరిన ఒప్పందాల పునఃపరిశీలన జరిపించామన్నారు. దీనిలో భాగంగా కాంట్రాక్టర్లకు అదనంగా రూ.1331 కోట్లు చెల్లించినట్లు తెలిందన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లపై వడ్డీ కింద రూ. 84.43 కోట్లు, అడ్వాన్స్ కింద రూ. 144.22 కోట్లు. అలాగే జల విద్యుత్ కేంద్రం.. ప్రాజెక్ట్ పనులు అప్పగించడానికి ముందుగానే సంబంధిత కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్ కింద రూ. 787 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్లుగా నిపుణుల కమిటీ నివేదిక పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు.
అయితే అదనపు చెల్లింపులపై నిపుణుల సంఘం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రాధమికమైనవని.. గత నవంబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖలో స్పష్టం చేసినట్లు చెప్పారు. పైన తెలిపిన నిర్ణయాలలో విధానపరమైన అతిక్రమలు లేవని, సంబంధిత అధికారుల ఆమోదం పొందిన తర్వాతే అదనపు చెల్లింపులు జరిగినట్లుగా లేఖలో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ఈ అదనపు చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం జరుగుతుందని మంత్రి చెప్పారు.