వామ్మో 'ప్లాట్ ఫాం 'బాదుడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2019 7:25 AM GMT
వామ్మో ప్లాట్ ఫాం బాదుడు

రాజమహేంద్రవరం: రైల్వే శాఖ రేట్ల బాదుడుకు జనం బెంబేలెత్తుతున్నారు. దసరా పండుగ పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడేలా చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే. విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరంలో ఈ రోజు నుంచి అక్టోబర్ 10 వరకు ప్లాట్ ఫాం టికెట్ల ధర పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. రూ.10లుగా ఉన్న ధరను ఒక్కసారిగా రూ.30లకు పెంచారు. దీంతో ప్రయాణికులు, వారిని స్టేషన్‌లో వదిలేయడానికి వచ్చిన బంధవులు గగ్గోలు పెడుతున్నారు.

వామ్మో అంటోన్న ప్రయాణికులు..

కొన్ని స్టేషన్‌లలో ధరలు పెంచి, మరికొన్ని స్టేషన్‌లలో ధరలు పెంచకపోవడంపై కూడా గందరగోళం నెలకొంది. రూ.30లు పెట్టి ప్లాట్‌ ఫాం టికెట్‌ కొనుగోలు చేస్తే కేవలం 2 గంటలపాటు చెల్లుబాటులో ఉంటుంది. ప్రతి రోజూ ప్లాట్‌ఫామ్‌ టికెట్లు 2,500 విక్రయిస్తుండగా...పండుగ రోజుల్లో 5వేల వరకు విక్రయిస్తుంటారు. అంటే..దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కనీస అవసరాల్లో కాకుండా..రాబడికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు.

అక్కడ పాత ధరే..!

దసరా పేరుతో రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ బాదుడు అమలు జరుగుతుంది. అయితే... గోదావరి రైల్వే స్టేషన్‌లో మాత్రం ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ ధర మాత్రం రూ.10లు మాత్రమే ఉంటుందని రైల్వే కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ కల్యాణ్‌ చెప్పారు.

Next Story