సముద్ర గర్భంలోని అట్టడుగు పొరల్లోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు..!

By Newsmeter.Network  Published on  11 Dec 2019 4:56 AM GMT
సముద్ర గర్భంలోని అట్టడుగు పొరల్లోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు..!

అది ప్రపంచంలోని అత్యంత లోతైన ప్రాంతం. నేలకు పదకొండు కి.మీ లోతున ఉంటుంది. పసిఫిక్ మహా సముద్ర గర్భపు అట్టడుగు పొరల్లో ఉండే ఈ ప్రాంతం పేరు మరియానా ట్రెంచ్. అక్కడ మానవాళి మనుగడ సాగించడమే అసాధ్యం. అయితే అలాంటి దుర్గమ, దుష్కర ప్రాంతంలోనూ ప్లాస్టిక్ భూతం పేరుకుపోతోంది. అక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. సముద్రగర్భం అధ్యయనం చేసే జపానీస్ సంస్థ జామ్ స్టెక్ గత మూడు దశాబ్దాలుగా పసిఫిక్ మహాసముద్రపు అట్టడుగు పొరల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ కాలుష్యం గురించి పరిశోధనలు సాగిస్తోంది.

మరియానా ట్రెండ్ లోనూ అత్యంత లోతైన ప్రాంతం ఛాలెంజర్ డీప్. ఇది పదివేల మీటర్ల లోతున ఉండే ప్రాంతం. అక్కడ కూడా చెక్క ముక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్టు జామ్ స్టెక్ కనుగొంది. విరిగిన చెప్పులు, ఒక పాడైన షూ, ఒక చిరిగిన సంచీ, కారు చక్రాలు, బొమ్మలు, షోకేసుల్లో ఉంచే మానెన్ క్విన్ తలకాయ వంటివి చాలెంజర్ డీప్ పైన దొరికాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల్లో పలు సముద్ర జీవాలు నివసిస్తున్నాయని, ఇది వాటి జీవావరణానికి హాని కలిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి లోతైన 3500 చోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వ్యర్థాల్లో ఎక్కువ భాగం ఒకసారి వాడి పారేసేవేనని ఈ పరిశోధనా బృందం నాయకుడు సానే చిబా అంటున్నారు. ఈ చెత్త 1980, 1990 నుంచి సముద్ర గర్భంలో తిరుగాడుతూ తిరుగాడుతూ ఈ లోతైన ప్రదేశాల్లో ఇరుక్కుపోయిందని ఆయన చెబుతున్నారు.

Plastic

సముద్రగర్భంలో మొత్తం 45 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలున్నాయని శాస్త్రవేత్తల అంచనా. అందులో ఇప్పటి వరకూ కేవలం ఒక శాతం అంటే 4,40,000 టన్నుల వ్యర్థాలను మాత్రమే కనుగొన్నారు.

Next Story