కరోనాను అడ్డుకున్న ప్లాస్మా థెరపీ..!

By సుభాష్  Published on  8 April 2020 8:20 AM GMT
కరోనాను అడ్డుకున్న ప్లాస్మా థెరపీ..!

దక్షిణ కొరియాకు చెందిన ఇద్దరు వయో వృద్దులకు కరోనా వైరస్ సోకింది.. వారిరువురు తీవ్రమైన న్యూమోనియా బారిన పడ్డారు. వారిని కాపాడడానికి ప్లాస్మా థెరపీని నమ్ముకున్నారు వైద్యులు.. అది సక్సెస్ అవ్వడంతో వారి ప్రాణాలు నిలబడగలిగాయి. కరోనా మహమ్మారిని అడ్డుకోడానికి ప్లాస్మా థెరపీనే ఆయుధమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కరోనా బారిన పడి జయించిన వారి నుండి సేకరించిన ప్లాస్మాను రోగుల శరీరంలోకి పంపుతారు. కరోనాతో పోరాడి గెలిచిన వారిలోని రక్తంలో కరోనా యాంటీబాడీస్ తయారై ఉంటాయి, వాటిని సేకరించి కరోనా నయం కాని రోగుల రక్తంలో ప్రవేశపెడతారు. ఆ యాంటీబాడీస్ కరోనా వైరస్ ను అంతం చేస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. శరీరంలోని కరోనా వైరస్ ను ఎదుర్కోడానికి ప్లాస్మా థెరపీ పనిచేస్తుంది. యాంటీ వైరల్ డ్రగ్స్ కు స్పందించని స్థితిలో క్రిటికల్ గా ఉన్న పేషెంట్లకు ప్లాస్మా థెరపీని ఉపయోగిస్తే సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నామని అన్నారు. పెద్ద ఎత్తున క్లినికల్ ట్రయల్స్ చేస్తే కానీ ఖచ్చితంగా చెప్పలేమని అంటున్నారు.

ఈ ట్రీట్ మెంట్ ను 71 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి పైనా, 67 సంవత్సరాల మహిళ పైనా నిర్వహించారు. 71 సంవత్సరాల వ్యక్తి చికిత్స కోసం కరోనా వైరస్ ను జయించిన 20ల్లో ఉన్న వ్యక్తి నుండి సేకరించిన ప్లాస్మాను వాడారు. దానితో పాటూ స్టెరాయిడ్స్ ఇవ్వడంతో ఆ ఆ వృద్ధుడి ప్రాణాలను కాపాడామని ఆసుపత్రి సిబ్బంది తెలిపింది. 67 సంవత్సరాల మహిళ మొదట ఎటువంటి చికిత్సకూ రెస్పాండ్ అవ్వలేదని.. మలేరియా, హెచ్ఐవీ డ్రగ్స్ కూడా ఇచ్చామని.. ఆక్సిజన్ థెరపీ ఇచ్చినా కూడా రికవర్ కానీ ఆ మహిళ ప్లాస్మా థెరపీ చేసి స్టెరాయిడ్స్ ఇవ్వగానే కోలుకోవడం మొదలైందని అన్నారు.

జర్నల్ ఆఫ్ కొరియన్ మెడిసిన్ లో ఈ విషాయలను ప్రస్తావించారు. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకూ మెడిసిన్ కనుక్కోబడలేదు.. ఎప్పుడొస్తుందో కూడా తెలీదు.. ఇలాంటి సమయంలో మనుషుల ప్రాణాలు కాపాడడానికి ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుందని సియోల్ సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ హెడ్ క్వార్టర్స్ లో పని చేసే క్వాన్ జూన్ ఉక్ తెలిపారు. ఎబోలా, సార్స్ లాంటి రోగాలను కూడా ప్లాస్మా థెరపీ ద్వారా నయం చేసిన సందర్భాలు ఉన్నాయని.. మరిన్ని పరీక్షలు చేస్తే కరోనాను కూడా ప్లాస్మా థెరపీ ద్వారా పారద్రోలే అవకాశాలు ఉండవచ్చని ఆయన అన్నారు.

చైనాలో కూడా ఇలాంటి ప్రయోగాలే చేశారట..! రెండు డాక్టర్ల బృందాలు.. 15 మంది క్రిటికల్ గా ఉన్న పేషేంట్లకు ప్లాస్మా థెరపీ నిర్వహించారట.. ఆ తర్వాత వారిలో చాలా మార్పులు వచ్చి.. కోలుకున్నారని గార్డియన్ పత్రిక కథనాన్ని వెల్లడించింది. చూస్తూ ఉంటే ప్లాస్మా థెరపీ అన్నది కరోనా మహమ్మారిని పారద్రోలడానికి ఎంతగానో సహాయపడేలా ఉంది.

కరోనా మహమ్మారికి ఎప్పుడు వ్యాక్సిన్ కనిపెడతారా అని ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే వేయి కన్నులతో వేచి చూస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కోలుకున్నా.. తిరిగి వ్యాప్తి చెందితే ఎలా అన్నది కూడా చాలా భయపెడుతోంది. ఇప్పటికే పలు సంస్థలు వ్యాక్సిన్ ను కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నామని ప్రకటించాయి. కానీ ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే చాలా సమయమే పడుతుంది.

Next Story