పావురం ప్రాణం తీస్తుందా?

By అంజి  Published on  19 Jan 2020 7:54 AM GMT
పావురం ప్రాణం తీస్తుందా?

“బాల పావురమా... ఒక గూడు కడదామా” అనో “ఆహహా ఓహోహో పావురమా” అని పాటలుపాడుకునే రోజులు పోయాయి. తెల్లని పావురంతో ప్రేమ పత్రాలు ప్రియుడికి పంపుకునే కాలం గడిచిపోయింది. ఎందుకంటే పావురమే మన పాలిట ప్రాణాంతకం. పావురాన్ని పెరగనిస్తే అది మన ప్రాణం తీస్తుంది. ఇప్పుడు తాజా పరిశోధనలు ఇదే మాట చెబుతున్నాయి. పావురం రెట్టల వల్ల ఫంగస్, బాక్టీరియా వ్యాపిస్తుందని, అవి గాలి ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులు. న్యుమోనియా వంటి వ్యాధులను తీసుకొస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

పావురాల రెట్టల వల్ల న్యుమోనియా వచ్చి ఇటీవలే ముంబాయిలో ఇద్దరు మహిళలు చనిపోయారు. క్రానిక్ హైపర్ సెన్సిటివిటీ న్యుమోనియా లేదా లంగ్ ఫైబ్రోసిస్ వంటి వ్యాధుల వల్ల ఊపిరితిత్తులు పనిచేయక వారు చనిపోయారు. వారి నివాసాలకు దగ్గర్లో పావురాలు పెద్ద సంఖ్యలో ఉండేవని వారి వైద్య రికార్డులు తెలియచేస్తున్నాయి. ముంబాయి డోంబివిలికి చెందిన హేమల్ షా అనే మహిళకు మొదట్నుంచీ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి. ఆమె ఇటీవలే కొత్తగా మారిన ఇంట్లో ఎయిర్ కండిషనర్ అమర్చిన చోట పావురాలు గూడు కట్టుకున్నాయి. వాటి రెట్టల వల్ల ఆమె కు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఇన్ ఫెక్షన్లు పెరిగి, ఇబ్బందులు మొదలయ్యాయి. చివరికి సెప్టెంబర్ 29, 2019 లో ఆమెకు ఊపిరితిత్తులను ట్రాన్స్ ప్లాంట్ చేశారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు. చివరికి ఆమె ప్రాణాలు పోయాయి.

పావురాలు ఎక్కువగా సంచరించడం, వాటి రెక్కలు విదిల్చినప్పుడు, రెట్టలు వేసినప్పుడు బాక్టీరియా వ్యాపిస్తుంది. దీనికి తోడు గోడలు చెమ్మగిల్లడం, దాని వల్ల ఫంగస్ విస్తరించడం కూడా ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ఇలాంటి కేసులు దాదాపు రెండు లక్షల వరకూ నమోదయ్యాయని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల పరిస్థితి మరింత దిగజారుతోందని వారంటున్నారు. మరో 68 ఏళ్ల పేషంట్ కూడా పావురాల పుణ్యమా అని ప్రాణాలు కోల్పోయింది.

పావురాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్లకు ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. మన దేశంలో కాలేయం, కిడ్నీ, గుండె మార్పెడి గురించి చాలా మందికి తెలుసు. కానీ ఊపిరితిత్తుల మార్పిడి ఇంకా అంత ప్రాచుర్యం పొందలేదు. మొత్తం మీద పావురాల అడ్డాలకు దూరంగాఉండటమే మంచిది అని వైద్యులంటున్నారు.

Next Story