ఫిలిప్పైన్స్ లో తొలి కరోనా మృతి

By అంజి  Published on  3 Feb 2020 3:51 AM GMT
ఫిలిప్పైన్స్ లో తొలి కరోనా మృతి

ఫిలిప్పైన్స్ లో తొలి కరోనా మృతి నమోదయ్యింది. ఇప్పటి వరకు కరోనా మృతులందరూ చైనాకు చెందినవారే అయితే తాజాగా పిలిప్పైన్స్‌లోని మనీలాలో ఉన్న ఆసుపత్రిలో ఒక వ్యక్తి కరోనా వైరస్‌ లక్షణాలతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

దీంతో కరోనా వైరస్‌ కారణంగా చైనా కాకుండా ఇతర దేశాల్లో తొలి మరణం నమోదైంది. చైనాలోని వుహాన్‌ నుంచి పిలిప్పైన్స్‌కు వచ్చిన రోగికి గత నెల 24వ తేదీన వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇదే సమయంలో అయనతో పాటు ప్రయాణించిన మరో మహిళకు కూడా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె మనీలాలోని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

Philippines coronavirus update

ఈ వైరస్‌ కారణంగా చైనాలో ఇప్పటికే 304 మంది మరణించినట్లు అక్కడి అధికారిక వర్గాల సమాచారం. జపాన్‌లో మరో మూడు కేసులు నమోదు కాగా, భారత్‌లో తాజాగా కేరళలో రెండో వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ సందర్భంగా భారత్‌ ఈ-వీసాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో ఉంటున్న చైనీయులు, ఇతర దేశస్తులకు తాత్కాలికంగా ఈ-వీసాను రద్దు చేస్తున్నట్లు బీజింగ్‌లోని భారత దౌత్య కార్యాలయం ఆదివారం ప్రకటించింది.

అటు కరోనా వైరస్‌ అమెరికాలో కూడా విస్తరిస్తోంది. ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన 8వ కేసును అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు శనివారం అధికారికంగా గుర్తించారు. దీనిపై స్పందించిన అమెరికా రక్షణశాఖ పెంటగాన్‌ విదేశాల నుండి వచ్చే వారికి అవసరమైతే వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలందించేందుకు తాము ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది.

Philippines coronavirus update

చైనాలోని వుహాన్‌ నగరం నుండి తిరిగి వచ్చిన వారిలో మరో ముగ్గురికి కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని జపాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనితో జపాన్‌లో కరోనా కేసుల సంఖ్య 20కి చేరింది. తాజాగా నిర్ధారణ అయిన ముగ్గురిలో ఒక వ్యక్తి జ్వరం, దగ్గుతో బాధపడుతుండగా అతడికి తొలుత చేసిన పరీక్షల్లో ఇన్ఫెక్షన్‌ సోకలేదని న్యూమోనియా బాధితుడిగా గుర్తించారని అయితే ఈ వ్యక్తికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించినపుడు వైరస్‌ సోకినట్లు తేలిందని తెలిపింది.

చైనాలోని వుహాన్‌ నగరంలో చైనా పిఎల్ఎ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన ఆస్పత్రి సోమవారం నుండి అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ ఆస్పత్రిని ప్రత్యేకంగా కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ బాధితుల కోసమే నిర్మించారు. సైన్యానికి చెందిన దాదాపు 1,400 మంది వైద్య నిపుణులు సోమవారం నుండి వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు గురైన పేషెంట్లకు వైద్య సేవలను అందించనున్నారు. ఈ ఆస్పత్రిని రికార్డు స్థాయిలో కేవలం తొమ్మిది రోజుల్లోనే నిర్మించి ఆదివారం ఉదయం సైన్యానికి లాంఛనంగా అందచేశారు.

Philippines coronavirus update

Next Story