కోవిడ్‌ ఎఫెక్ట్ ఏమో గానీ అన్ని దేశాలు గడగడలాడిపోతున్నాయి. ఎంత సన్నిహితులు అయినా ఒకరిని ఒకరు ఎదురు పడినప్పుడు ఖచ్చితంగా టెన్షన్ పడుతున్నారు అనటం లో ఆశ్చర్యమే లేదు. ఇక సామూహిక కార్యక్రమాలు అయితే వీలైనంత వరకూ తప్పించుకుంటున్నారట.. కానీ కొన్ని సార్లు తప్పదు కదా అలాంటి ఒక సిట్యుయేషన్ ని ఫిలిపైన్స్లో ఎలా హ్యాండిల్ చేశారో తెలుసా..

ఫిలిప్పైన్స్‌లోని సముద్రతీర నగరం బాకొలాడ్‌లో అక్కడి ప్రభుత్వం సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించింది. స్థానిక సిటీహాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 220 జంటలు ఒక్కటయ్యాయి. పెండ్లి కొడుకులు పెండ్లి కూతుళ్లు పెళ్లి బట్టలతో ఈ సామూహిక వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు.

కోవిడ్‌ వైరస్‌ అన్ని దేశాలకు పాకుతుండటంతో ఈ సామూహిక వివాహ మహోత్సవ నిర్వాహకులు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి నుంచి గత రెండు వారాలుగా వారు ఎక్కడెక్కడ ప్రయాణాలు చేశారనే వివరాలు సేకరించారు. ఎందుకంటే కోవిడ్‌ వైరస్‌ సోకిన 14 రోజుల తర్వాతగానీ వ్యాధి లక్షణాలు బయటపడవు. అందుకే నిర్వాహకులు 14 రోజుల ప్రయాణ వివరాలు తీసుకున్నారు.

అంతేగాక, అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనను కూడా నిర్వాహకులు కచ్చితంగా అమలు చేశారు. దీంతో పెండ్లి పీటలెక్కిన జంటలు మాస్కులతోనే ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, ఆఖరికి ముద్దులు కూడా మాస్కులు ధరించే పెట్టుకోవాల్సి వచ్చింది. మాస్కులతో ముద్దులు పెట్టుకోవడం ఇబ్బందిగానే ఉన్నా.. కోవిడ్‌ భయంతో తప్పదు కదా అని కొత్త జంటలు సరిపెట్టుకున్నారు. వధూవరులు సర్జికల్ మాస్కులు ధరించి ముద్దులు పెట్టుకోవడం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

కాగా, వాలైంటైన్స్ డే తర్వాత సామూహిక వివాహాలు చేసుకోవడం మనీలాలో ఓ సంప్రదాయంగా వస్తోంది. 2013లో అత్యధికంగా 2,013 జంటలకు వివాహాలు జరిగి వార్తల్లో నిలచింది. అయితే ఈసారి మాత్రం వధూవరులు మాస్కులు ధరించడం, వాటితోనే ముద్దాడటం సంచలనంగా మారింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.