మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు..హైకోర్టులో అయ్యన్న పిటిషన్

By సుభాష్  Published on  19 Jun 2020 8:15 AM GMT
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు..హైకోర్టులో అయ్యన్న పిటిషన్

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విశాఖలోని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిర్భయచట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. నాపై అధికార పార్టీ కక్షతో అక్రమంగా కేసు బనాయించారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. నాపై నమోదైన కేసులు కోట్టివేయడంతో పాటు తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని, పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన హైకోర్టును కోరారు.

కాగా, రెండు రోజుల కిందట విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణిని అసభ్యంగా దూషించారనే ఆరోపణలు చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు కింద ఐపీసీ సెక్షన్‌ 354-ఎ(4), 500, 504,5050 (1)(బి), 505(2), 506, 509 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

అయ్యన్నపాత్రుడు తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లచ్చాపాత్రుడు చిత్రపటం మున్సిపల్‌ కార్యాలయంలో తొలగించారని వివాదం చెలరేగింది. దీంతో గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అయ్యన్న పాత్రుడు కూడా పాల్గొన్నారు. ఈ సభలో తనను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని మున్సిపల్‌ కమిషనర్‌ ఆరోపించారు.

Next Story