గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం తొలగింపు
By సుభాష్ Published on 18 Sep 2020 10:27 AM GMTప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎంను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి శుక్రవారం తొలగించింది. పేటీఎంతోపాటు పేటీఎం ఫస్ట్ గేమ్స్‌ను సైతం తొలగించింది. పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్స్ మాత్రం యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో గూగుల్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇదివరకే పేటీఎంకు గూగుల్ నోటీసులు జారీ చేసింది. తరచూ నిబంధనలు ఉల్లంఘించడంతో తాజాగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే గూగుల్ రూల్స్ ప్రకారం.. ఎలాంటిజూదాలు, ఆన్‌లైన్ బెట్టింగులు నిర్వహించకూడదు. కానీ పేటీఎం, పేటీఎం ఫస్ట్ గేమ్ యాప్స్ ద్వారా ఫాంటసీ క్రికెట్ సేవలను ప్రారంభించింది. జూదాన్ని ప్రోత్సహించేదిగా ఉండటంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.
స్పందించిన పేటీఎం
కాగా, గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగింపుపై పేటీఎం స్పందించింది. గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రస్తుతానికి పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అప్‌గ్రేట్ చేసుకోవడానికి అందుబాటులో లేదని తెలిపింది. త్వరలో పేటీఎం అందుబాటులోకి వస్తుందని, సేవలు ప్రారంభం అవుతాయని పేటీఎం వెల్లడించింది. ప్రస్తుతం పేటీఎం 5 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.