కాకినాడలో పవన్ 'రైతు సౌభాగ్య దీక్ష'
By రాణి Published on 12 Dec 2019 12:42 PM ISTతూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గురువారం ఉదయం 8 గంటలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష చేపట్టారు. కాకినాడలోని జేఎన్టీయూ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన ఈ దీక్షలో నాగబాబు, నాదెండ్ల మనోహర్, పార్టీ సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు. దీక్ష ప్రాంగణానికి చేరుకోగానే మహిళలు పవన్ కు హారతినిచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రైతులకు ఇచ్చే గిట్టుబాటు ధరలు వారి ఖర్చులకు కూడా సరిపోవడం లేదన్నారు. పంటలను కొనుగోలు చేసిన వెంటనే నగదు చెల్లించాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, వారి బకాయిలను చెల్లించాలని, మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.
పవన్ తో తమ సమస్యలను చెప్పుకునేందుకు దీక్షా ప్రాంగణానికి వరి కంకులతో అనేక మంది రైతులు గోదావరి, సీమ జిల్లాల నుంచి తరలి వచ్చారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర అయినా రావడం లేదంటూ రైతన్న ఆవేదన చెందాడు. పవన్ కల్యాణ్ అధికారంలోకి వస్తే రైతు కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ వచ్చాక రైతన్నను పట్టించుకున్న నాథుడే లేడన్నారు పవన్. రైతులందరి తరపున ప్రభుత్వంతో తాను పోరాడుతానని తెలిపారు.