రైతులకు నేను అండగా ఉంటా : పవన్ కల్యాణ్

By రాణి  Published on  15 Feb 2020 8:54 AM GMT
రైతులకు నేను అండగా ఉంటా : పవన్ కల్యాణ్

అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్..రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు వచ్చినట్లుగా తాను రాలేదని..కేవలం రైతులకే భరోసా ఇచ్చేందుకే వచ్చానని పేర్కొన్నారు.

రాష్ర్ట రాజధాని ఎక్కడుండాలనేది ప్రభుత్వ నిర్ణయమే అయినప్పటికీ..గతంలో ఉన్న ప్రభుత్వమే ఆ నిర్ణయాన్ని తీసుకుందని, ఇప్పుడున్న ప్రభుత్వానికి రాజధానిని మార్చే హక్కు లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేస్తామంటే ఆనాడు అంగీకరించిన వైసీపీ..ఇప్పుడెందుకు రాజధాని నిర్మాణంలో లొసుగులు చూపిస్తోందని ప్రశ్నించారు. రాజధాని ఎక్కడికీ తరలి పోదని పవన్ కల్యాణ్ రైతులకు భరోసా ఇచ్చారు.

రైతులకు మద్దతుగా ర్యాలీ చేద్దామని ప్రణాళిక చేసుకున్నాక..ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో దానిని వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. వాయిదా పడిన ర్యాలీని త్వరలోనే నిర్వహిస్తామన్నారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని బీజేపీ పెద్దలు చెప్పారన్నారు. రైతులకు అండగా ఉండేందుకు ఎవరొచ్చినా రాకపోయినా..తాను మాత్రం రైతుల పక్షానే ఉంటానని పవన్ స్పష్టం చేశారు.

Next Story