పవన్ కల్యాణ్.. నీలో 'చేగువేరా' చనిపోయాడా..?
By Newsmeter.Network Published on 18 Jan 2020 6:21 PM ISTహలో పవన్ కల్యాణ్ గారూ.... మీరంటే మాకెంతో ఇష్టం. మీరు కాలర్ లో మెడ మీద చెయ్యేసి అలా తడుముకుంటే పడి చచ్చిపోతాం. మీరు చిలిపిగా చూస్తే చాలు మేం పరవశించిపోయి ఈలలు వేసేస్తాం. మీరు మైకేల్ జాక్సన్ స్టెప్పులు వేస్తూంటే మేం కేకలు వేసి, కాగితాలు చించి థియేటర్లో రచ్చ రచ్చ చేసేస్తాం.
మీరు మాకు కేవలం స్టంట్లు చేసి, రొమాన్స్ చేసి, మెప్పించే హీరో మాత్రమే కాదు. మీరు చాలా డిఫరెంట్. మీరు తక్కువగా మాట్లాడతారు. ఎక్కువగా మౌనంగానే ఉంటారు. కోట్ల సంపదలున్నా ధోతీ కట్టి, ఫార్మ్ హౌస్ లో గోసేవ చేస్తారు. నాగలి పడతారు. అందుకే మీరంటే మాకు చాలా ఇష్టం. మీ గదిలో పికాసో పెయింటింగులు ఉండవు. మీరు అమితంగా ఆరాధించే యుగపురుషుడు జ్యోతిరావు ఫులే చిత్రం ఉంటుంది. అందుకే మీరంటే మాకు చాలా ఇష్టం. మీరు బాగా పుస్తకాలు చదువుతారు. అందుకే మీరంటే మాకు చాలా ఇష్టం.
అంతే కాదు. మీకు చేగువేరా అంటే ప్రాణం. సాయుధపోరులో, పదవులను వదులుకుని, వైభోగాలను త్యజించి, బొలీవియా అడవుల్లో విప్లవోద్యమం నడిపిన వామపక్ష వేగుచుక్క చేగువేరా. తిరుగుబాటుకు మారుపేరుగా విజృంభించిన అరుణారుణ విప్లవ తారక చేగువేరా. పీడిత, తాడిత, పతిత, దళిత వర్గాలకు వేకుల వెలుగులు పంచే ఎర్ర సూరీడు చేగువేరా. చేగువేరా ను మీరు ఇష్టపడతారు కాబట్టే మీరంటే మాకు చచ్చేంత ఇష్టం.
అలాంటి మీరు ఒక్క సారి ఉన్నట్టుండి మీలో దాగున్న చేగువేరాను చంపేశారా? ఢిల్లీ దర్బార్లో పడిగాపులు పడి, క్యూల్లో నిలబడి బిజెపిలో పదోనెంబర్ నేత జేపీ నడ్డాను కలిసి అదేదో తరించిపోయినట్టు ప్రవర్తిస్తున్నారేమిటి? వాళ్లు అడగటమే ఆలస్యం పార్టీని బిజెపి పాదాల మోల పెట్టేస్తారా?
రాష్ట్రానికి అన్నివిధాలా ద్రోహం చేసిన బీజేపీతో చేతులు కలుపుతావా అంటూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మీపై విరుచుకుపడ్డాయి. రాజకీయాల్లో ఎత్తులు పొత్తులు ఉంటాయే తప్ప బాకీలు ఉండవని ఆ పార్టీల నేతలు మిమ్మల్ని ఎద్దేవా చేశారు. ‘‘విప్లవ వీరుడు చేగువేరా బొమ్మ పెట్టుకుని చిలకపలుకులు పలికిన పవన్ ఇప్పుడు ‘చెంగువీరుడు’ అయ్యాడు. ఢిల్లీలో బీజేపీ నాయకుడు నడ్డాను కలిశాక పవన్‌కు పాచిపోయిన లడ్డూలు బందరు లడ్లు అయ్యాయి’’ అని వాళ్లు ఆక్షేపిస్తున్నారు. ఇవన్నీ మీకు వినిపించడం లేదా?
బిజెపితో ఎందుకు విడిపోయారు? ఎందుకు కలిశారు? తెదేపాను ఎందుకు విమర్శించారు. మళ్లీ ఎందుకు రహస్య పొత్తులు పెట్టుకున్నారు? పార్టీకి కార్యక్రమం, ఏజెండా లేకుండా చేసేశారు. ఇదంతా ఎందుకు? మీ విప్లవ పోరాటానికి ఇక ఇంతే సంగతులా? మీలో చేగువేరా చచ్చిపోయాడా పవన్ గారూ..!!