స్కార్పియో మ్యాన్.. అతడే 'మహీంద్రా' నూతన వారసుడు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Jan 2020 9:54 AM GMT
పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అత్యధిక వాటా కలిగిన వారిలో ఎవరో ఒకరు లేదా ఆ కంపెనీ వారసులే చైర్మన్లుగా వ్యవహరిస్తుంటారు. కానీ, ప్రముఖ భారత వాహనరంగ సంస్థ మహీంద్రా మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. ఇప్పటికే దేశియ వాహనరంగ సంస్థలలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న మహీంద్రా కంపెనీ.. తమ దగ్గర పనిచేసే ఉద్యోగికే కంపెనీ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంది. కంపెనీలో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పజెప్పాలని మహీంద్రా గ్రూప్ అనుకుంది. అనుకున్నదే తడవుగా కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో నూతన చైర్మన్ కోసం వెదుకలాట ప్రారంభించింది. అయితే దీనికోసం కంపెనీ నాయకుడు పెద్దగా కష్టపడకుండానే వారసుడు దొరికిపోయాడు. కంపెనీని సమర్థవంతంగా ముందుకు నడపడానికి స్కార్పియో మ్యాన్‌గా పేరుగాంచిన పవన్ గొయెంకా అన్ని విధాల అర్హుడని మహీంద్ర గ్రూప్ నిర్ణయించుకుంది. మహీంద్రా వంటి ఇంటర్నేషనల్ కంపెనీని మ్యానేజ్ చేయడం అంటే కత్తి మీద సామే.. అందుకే కంపెనీలో ఎటువంటి బాధ్యతనైనా మోయగల పవన్ గొయెంకాకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు మేనేజ్‌మెంట్ రంగం సిద్దం చేస్తుంది.
అసలు ఎవరీ స్కార్పియో మ్యాన్ పవన్ కుమార్ గొయెంకా..!
1990 కాలంలో కార్ల విభాగంలో దేశీయంగా పేరుగాంచిన వాహనాలు చాలా తక్కువే. దీంతో ప్రజలకు అందుబాటులో ఉండేలా కొత్త కార్లను ఉత్పత్తి చేయాలని మహీంద్రా కంపెనీ భావించింది. దీనికి సంబంధించి మహీంద్రా కంపెనీ ఓ టీమ్‌ను ఏర్పాటు చేసింది. అప్పటికే కార్ల పరిశోధనలో మేధోసంపత్తి కలిగిన గొయెంకాను దానికి లీడర్‌గా నియమించింది. కంపెనీ ఇచ్చిన బాధ్యతలను గొయెంకా నిరంతరం శ్రమిస్తూ విజయవంతంగా పూర్తి చేశాడు.
ఆ సమయంలోనే తన భార్యకు మమతకు కేన్సర్ వ్యాధి వచ్చినా.. గొయెంకా తన లక్ష్యాన్ని మాత్రం విడువలేదు. తాను ఇంత ఎదగడానికి తన భార్య సహకారం ఎంతో ఉందని గొయెంకా చెప్తున్నారు. అహర్నిశలు చేసిన కృషి ఫలితంగా దేశీయంగా తయారుచేసిన తొలి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ 'స్పార్పియో' మార్కెట్లోకి వచ్చింది. మహీంద్రా చరిత్రలో స్పార్పియో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోయింది. తన పేరు కూడా మారుమోగిపోయింది. ఎంతలా అంటే.. తన పేరును స్కార్పియో మ్యాన్‌గా ఉచ్చరించే అంతగా..
అలాగే.. ఆ తర్వాత వచ్చిన మహీంద్రా ట్రాక్టర్, బొలేరో వాహనాలు కూడా దాదాపు అంతే స్థాయిలో విజయాన్ని కట్టబెట్టాయి. అయితే ఈ క్రెడిట్ అంతా కంపెనీ పురోగతిలో మెయిన్‌రోల్‌గా ఉన్న గొయెంకాకే దక్కుతుంది. అయితే ఈ విజయంలో మార్కెటింగ్, డిజైనింగ్, ప్రొడక్షన్ విభాగాల పాత్ర కూడా ఉందని పవన్ గొయెంకా అంటారు. ఇవేకాకా ఆయన పర్యవేక్షణలో ఎక్స్‌యూవీ 500తో పాటు మరికొన్ని వాహనాలు సైతం మహీంద్రా కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చాయి.
ఇక.. పవన్ కుమార్ గొయెంకా 1954 సంవత్సరం సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ చిన్నగ్రామంలో జన్మించారు. గొయెంకా చిన్న వయసులోనే వారి కుటుంబం బతుకుదెరువు కోసం కోల్‌కతాకు వలసవెళ్లింది. గొయెంకా తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిగా హీందీలో చదివారు. ఆ తర్వాత ఐఐటీ కాన్పూర్‌లో బీ.టెక్ పూర్తి చేశారు. అనంతరం ‘ల్యూబ్రికెంట్స్ ఇన్ ఆర్టిఫీషియల్ జాయింట్స్’ అనే అంశంపై అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. అమెరికాలోనే ప్రముఖ జనరల్ మోటార్స్ రీసెర్చ్ విభాగంలో ఉద్యోగిగా జాయిన్ అయ్యారు. ఉద్యోగ సమయంలో గొయెంకాకు భాషాపరమైన ఇబ్బందులు తెలెత్తాయి. దీంతో కంపెనీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్సులో జాయిన్ అయ్యారు. అక్కడే ఆంగ్ల భాషపై మాంచి పట్టు సాధించారు. దాదాపు 14 సంవత్సరాలు గొయెంకా అక్కడే పని చేశారు. అప్పుడే భారత్‌లో కార్పొరేట్ ప్రపంచం రెక్కలు విచ్చుకుంటోంది. భారత్‌లోని ప్రముఖ కంపెనీలు టాలెంటెడ్ ఉద్యోగుల కోసం పత్రిక ప్రకటనలు చేశాయి. విదేశి పత్రికల్లో సైతం ప్రకటనలు రావడంతో గొయెంకా తన ఆసక్తిని తెలియజేస్తూ మహీంద్రా కంపెనీకి ఉత్తరం రాశారు. కొన్నాళ్లకు తన భార్య మమత భారత్‌కు తిరిగి రావాలని కోరడంతో స్వదేశానికి తిరిగి వచ్చారు.
ఇక.. గొయెంకా భారత్‌కు వచ్చిన సమయంలోనే ఎయిరిండియా సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు విమాన సర్వీసులను ఎయిరిండియా తగ్గించింది. కోల్‌కతాకు వచ్చిన గొయెంకా పలు కంపెనీలతో సంప్రదింపులకు యత్నించారు. కోల్‌కతా విడిచి వెళ్లవద్దని.. ఒక వేళ వెళ్లినా.. ఉదయం వెళ్లి సాయంత్రం రావాలని అమ్మ షరతు.. దీంతో గొయెంకాకు అవకాశాలు తగ్గిపోయాయి. ముంబై నుంచి కోల్‌కతాకు మాత్రం విమాన సర్వీసులు యాధావిధిగా నడుస్తుండేవి. దీంతో గొయెంకా తనకు వచ్చిన లేఖతో మహీంద్రా కంపెనీలోకి ఇంటర్య్వూకి వెళ్లాడు. ముఖాముఖి చర్చలో ఆనంద్ మహీంద్రా తన లక్ష్యాలను గొయెంకాకు వివరించారు. తన ఆశయాలకు ఆకర్షితులైన ఆనంద్ కంపెనీని ఎలా ముందుకుతీసుకెళ్లాలన్నదానిపై వివరించారు. దేశీయంగా కొత్త కొత్త వాహనాలను మార్కెట్లోకి తేవాలన్నది ఆనంద్ కల. ఇది ఎంతగానో గొయెంకాకు నచ్చింది. దీంతో గొయెంకా మహీంద్రా కంపెనీలో చేరారు.
ఆ తర్వాత నాసిక్‌లో ఉన్న పరిశోధనా కేంద్రానికి సమీపంలో మహీంద్రా కంపెనీ గొయెంకాకు నివాసం ఏర్పాటు చేసింది. విధుల్లో చేరిన గొయెంకాకు సీనియర్ల నుంచి చేధు అనుభవాలు ఎదురయ్యాయి. తనకు ఎదురైన సమస్యలను అధిగమించడం తనకు పెద్ద కష్టమేమి కాలేదని గొయెంకా అంటారు. కంపెనీ చైర్మన్ తనపై ఉంచిన నమ్మకంతో గొయెంకా ముందుకెళ్లారు. పరిశోధనలపై పట్టుమాత్రమే ఉన్న గొయెంకా కంపెనీలోని ప్రముఖులతో చర్చిస్తూ మెలుకువలను ఇట్టే పట్టేసుకున్నారు. తనకున్న పట్టుదల, శ్రమతో కంపెనీలోని అందరి మన్నలు పొందారు.
అయితే.. తాను పని రాక్షసుడినని ఎవరైనా అంటే ఒప్పుకోనని గొయెంకా చెప్పాడు. తానెప్పుడు పని విషయంలో ఒత్తిడికి గురికాలేదన్నారు. కంపెనీ అభివృద్ధికై నిరంతరం తపించే గొయెంకా.. రోజుకు 16 గంటల పాటు పనిచేస్తారు. ఇష్టపడి పనిచేస్తే ఏది కష్టసాధ్యంగా ఉండదని ఆయన అంటారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు గొయెంకా పనిచేస్తారు. సమయాన్ని గొయెంకా ఏమాత్రం వృథా చేయడు. విదేశీ ప్రయాణాలు చేసే సమయాల్లో విమానాల్లోనే కునుకు తీస్తారు. దీనివల్ల అక్కడికెళ్లాక విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన అంటారు.
ఇక కారులో ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ముఖ్యమైన కాల్స్ కు మాత్రం సమాధానమిచ్చే గొయెంకా.. రాత్రి సమయంలో భోజనం చేసేటప్పుడు కూడా ఆయన ముందు ఆరు ల్యాప్‌టాప్‌లు ఉంటాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఆయనకు కంపెనీ పట్ల ఉన్న ప్రేమ, నిబద్ధతను ఎంతటిదో.. అమెరికాలోని ప్రముఖ సంస్థ అయిన అమెరికన్ జనరల్ మోటర్స్ సంస్థ కూడా ఆయనని వదులుకోవడానికి పెద్దగా ఇష్టపడలేదు. గొయెంకా కోసం నాలుగేళ్ల పాటు కంపెనీ తలుపులు తెరిచే ఉంచింది. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న గొయెంకా.. ఏప్రిల్ 1, 2020న కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.