నేను ఎమ్మెల్యే అయింది మోరీలు కట్టడానికి కాదు.. తెలంగాణ కోసమని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. సోమవారం హుజురాబాద్‌లో ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆనాడు ఏ పని చేయకపోయినా ఓట్లు వేసి గెలిపించారని, అందుకే మీ రుణం తీర్చుకోవాలనే భావన గుండెల్లో ఉండేదని అన్నారు. మురికి పని చేసేవారంతా దళిత బిడ్డలేనని, వారికి జీతం ఇవ్వకపోతే ఎలా అని మున్సిపాలిటీల్లో ఫండ్‌ ఏర్పాటు చేశానన్నారు. అన్ని ప్రాంతాల్లో పందుల బెడద పోగొట్టేందుకు ఎరుకలి వాళ్లకు పందులు పెంచేందుకు షెడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వెంటనే ఆ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించినట్లు చెప్పారు.

జమ్మికుంట పట్టణానికి 20 రోజుకోసారి మంచినీళ్లు వచ్చేవని, ఆ సమస్య తీర్చేందుకు జమ్మికుంటకు రూ. 40 కోట్లు, హుజురాబాద్‌కు రూ. 50 కోట్లు మంజూరు చేశామన్నారు. డబుల్‌ బెడ్‌ రూం పథకంలో భాగంగా గుడిసెల్లో ఉన్నవారికి 500 ఇళ్లు సిద్దమవుతున్నాయన్నారు. అలాగే సొంత స్థలం ఉండి ఇల్లు లేనివారికి ఇల్లు మంజూరు చేసే విధంగా కేసీఆర్‌తో మాట్లాడుతున్నామని, త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటామన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా.. వెంటనే తీర్చేందుకు ముందుంటానని పేర్కొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.