పంగా ట్రైలర్ కి పవర్ ఫుల్ రెస్పాన్స్
By రాణి Published on 20 Jan 2020 7:15 AM GMTముఖ్యాంశాలు
- పంగా ట్రైలర్ ని విడుదల చేసిన యూనిట్
- ప్రేక్షకుల నుంచి తారా స్థాయిలో స్పందన
- అద్భుతంగా పోషించిన కంగనా రనౌత్
అద్భుతమైన విజయాలు సాధించారు. ప్రపంచపు అంచులకు దేశ కీర్తి పతాకను ఎగరేశారు. కానీ పెళ్లై తల్లైన తర్వాత ఉన్నపళంగా ఆకాశంనుంచి కుప్పకూలి నేలమీద పడ్డారు. ఇది కేవలం ఏ ఒక్క మహిళా క్రీడాకారిణి కథ కానేకాదు. అంతర్జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపించి అగ్రపథాన నిలచిన ఎంతోమంది స్టార్ క్రీడాకారిణుల జీవిత చిత్రం. మేరీకోమ్, సెరీనా విలిమమ్స్, సానియా మీర్జా, కోనేరు హంపి ఇలా చెప్పుకుంటూపోతే ఒక్కపేరు కాదు పదులకొద్దీ పేర్లు బైటికొస్తాయి. కానీ కొంతలో కొంత మన కోనేరు హంపికి మాత్రం మిగతావాళ్లు చేసిన పోరాటాలతో పనిలేకుండా పోయింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆమె ఆడిన ఆట తెలివితేటలకు మాత్రమే సంబంధించింది కావడం, కుటుంబ సభ్యులనుంచి పూర్తి స్థాయిలో ఆమెకు సహకారం అందడం.
పంగా సినిమా సరిగ్గా ఇదే కథాంశంమీద రూపుదిద్దుకుంది. ఇండియన్ మహిళా కబడ్డీ టీమ్ కెప్టెన్ జయా నిగమ్ జీవితచిత్రం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. జీవితంలో పోరాడి గెలిచిన ప్రతి ఒక్క మహిళకూ తమ సినిమా అంకితమని డైరెక్టర్ అశ్వినీ అయ్యర్ తివారీ చెబుతున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత పట్టుదలతో తిరిగి మళ్లీ కెరీర్ లో అగ్రపథంలో నిలవాలని పోరాటం చేసే ప్రతి తల్లికీ తమ చిత్రం ఒక ఉదాహరణ అనీ, తప్పకుండా ఈ సినిమాని చూసిన తర్వాత మహిళామణులు నూతన ఉత్తేజంతో స్ఫూర్తిని పొంది మళ్లీ జైత్రయాత్రను మొదలుపెడతారనీ చెబుతున్నారు.
కబడ్డీ టీమ్ కెప్టన్ జయానిగమ్ పాత్ర
పంగాలో జయా నిగమ్ తన బిడ్డకోసం పడ్డ తపన, కుటుంబమా లేక కెరీరా అన్న విషయంలో ఎటూ తేల్చుకోలేక ఆమె పడ్డ అంతులేని సంఘర్షణ మొదలైన అంశాలను పూర్తి స్థాయిలో చూసేవాళ్ల మెదళ్లకు పదును పెట్టేలా, నిరుత్తరులయ్యేలా వెండితెరపై ఈ సినిమా వెలుగులీనబోతోంది. పిల్లాడు పుట్టిన తర్వాత జయా నిగమ్ పూర్తిగా తన బిడ్డ శ్రేయస్సుకోసం పనిచేయాలని నిర్ణయించుకుంది. రైల్వేల్లో ఉద్యోగం చేస్తూ కేవలం తన బిడ్డ భవిష్యత్తుకోసం కష్టపడాలని నిర్ణయించుకుంది. కానీ తనలో ఉన్న జీల్ ఆమెని నిలువనివ్వలేదు. కొద్దికొద్దిగా మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకుని బిడ్డకు కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేసేసి, తను జీవితంలో మెల్లగా అడుగులు వేసే స్థితిలో ఉన్నపళంగా ఉవ్వెత్తున కెరటమై మళ్లీ ఎగసిపడిన స్టార్ ప్లేయర్ ఆమె.
తనతోపాటుగా ఫీల్డ్ లో ఉన్నవాళ్లంతా రిటైర్ అవుతున్న సమయంలో ఆమె మళ్లీ కొత్త ఉత్సాహంతో తిరిగి తాను ఎంచుకున్న రంగంలో అడుగుపెట్టి అద్భుతమైన విజయాలు సాధించింది. వయసైపోయింది అని విమర్శించినవాళ్లంతా ముక్కున వేలేసుకుని చూస్తూ ఉండిపోయే విధంగా అద్భుతమైన పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది.
అంత ఇన్ స్పైరింగ్ పర్సనాలిటీ పాత్రను తెరమీద పోషించమంటే ఆషామాషీ ఏం కాదు. కానీ జయ నిగమ్ ని అచ్చంగా పూర్తిగా దించేసిన టాలెంట్ కంగనా రనౌత్ దేనని ఒప్పుకోక తప్పదు. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కంగనకు పూర్తి స్థాయిలో ఇది సూపర్ డూపర్ హిట్ గా నిలచే సినిమా మాత్రమే కాక, పూర్తిగా తన కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలచిపోయే సినిమా అవుతుందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పంగా ట్రైలర్ రిలీజ్ అయిన మొదటిరోజే ప్రేక్షకులనుంచి తారా స్థాయి రెస్పాన్స్ రావడం దీనికి నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు.