పన్నెండేళ్లుగా కర్నూలు జిల్లాలో నివసిస్తున్న పాకిస్తానీ అరెస్ట్

By Newsmeter.Network  Published on  9 Dec 2019 10:28 AM GMT
పన్నెండేళ్లుగా కర్నూలు జిల్లాలో నివసిస్తున్న పాకిస్తానీ అరెస్ట్

ముఖ్యాంశాలు

  • 12 సం.లుగా కర్నూలు జిల్లాలో నివసిస్తున్న పాకిస్తానీ
  • దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన ఖాన్
  • నేరుగా కర్నూలు జిల్లా గడివేములకు వెళ్లిన ఖాన్
  • ఓ విధవను పెళ్లి చేసుకుని అక్కడే కాపురం పెట్టిన ఖాన్
  • ఖాన్ కి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు
  • కుటుంబ సభ్యులను పాకిస్తాన్ కి తీసుకెళ్లే ప్రయత్నం
  • సికింద్రాబాద్ లో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • చాలాకాలంగా నిందితుడిపై నిఘా పెట్టిన పోలీసులు
  • పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కి యాత్రికుడిగా వెళ్లే ప్రయత్నం

కర్నూలుజిల్లా గడివేముల గ్రామం. దాదాపు పన్నెండేళ్లుగా ఈ గ్రామంలో ఒక వ్యక్తి పెయింటర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఎక్కడినుంచి వచ్చాడో తెలీదు. ఏ ఊరివాడో తెలీదు. ఏ దేశంవాడో తెలీదు. కానీ స్థానికులతో బాగా కలిసిపోయాడు.

అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ స్థానికుల అభిమానాన్ని చూరగొన్న ఈ వ్యక్తి ఒక పాకిస్తానీ అనీ, అధికారికమైన పత్రాలేవీ లేకుండానే భారత్ లో ప్రవేశించాడనీ, పన్నెండేళ్లుగా ఏ అనుమతీ లేకుండా ఆ పొరుగుదేశం పౌరుడు తమ మధ్యే నివసిస్తున్నాడనీ తెలుసుకుని గడివేముల ప్రజలు ఆశ్చర్యపోయారు.

కర్తార్ పూర్ కి యాత్రికుడిగా వెళ్లేందుకు

పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కి యాత్రికుడిగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అధికారులు సదరు పాకిస్తానీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తన భార్యతో, ఐదుగురు పిల్లలతో కలిసి సదరు వ్యక్తి స్వదేశమైన పాకిస్తాన్ కు వెళ్లే ప్రయత్నం చేస్తూ పట్టుబడిపోయాడు. సికింద్రాబాద్ లోని ఒక హోటల్ సమీపంలో సదరు పాకిస్తానీని అధికారులు వ్యూహాత్మకంగా అరెస్ట్ చేశారు.

అనధికారికంగా భారత్ లో నివసిస్తూ పట్టుబడిపోయిన షేక్ గుల్జార్ ఖాన్ అలియాస్ గుల్జార్ మాసిహ్ వయసు యాభై ఒక్క సంవత్సరాలు. దుబాయ్ నుంచి జనవరి 2008 లో అనధికారికంగా అడ్డదారిలో ఇండియాలో ప్రవేశించాడు.

పక్కా సమాచారం అందుకున్న తెలంగాణ పోలీస్ విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ సెల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మాటువేసి ఈ పాకిస్తానీని పట్టుకుంది. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న హద్మర్లాలోని కులువాల్ గ్రామం షేక్ గుల్జార్ ఖాన్ స్వగ్రామం.

నవంబర్ 3వ తేదీన ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలసి సికింద్రాబాద్ కు వచ్చాడు. మర్నాడు రైల్లో ఢిల్లీకి ప్రయాణం. పక్కా సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు మాటువేసి ఖాన్ ని అరెస్ట్ చేశారు. ఢిల్లీనుంచి పంజాబ్ లోని అమృత్ సర్ మీదుగా పాకిస్తాన్ వెళ్లేందుకు ఖాన్ ప్లాన్ చేసుకున్నడు. స్థానికుల సాయంతో యాత్రికుల పేరుతో తనకూ తన కుటుంబ సభ్యులకూ వీసాలుకూడా సంపాదించాడు.

అమృతసర్ లో ఉన్న ఖాన్ దగ్గరి బంధువైన ఒక మహిళ వీరికి యాత్రికులుగా వీసాలు ఇప్పించడంలో సాయం చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. జనవరి 2008లో దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన ఖాన్ తాను భారతీయుడిననీ, తన అధికారిక ధృవీకరణ పత్రాలు కనిపించడంలేదనీ చెప్పి ఇక్కడే పాగా వేశాడు.

గడివేముల గ్రామంలో

ముంబైనుంచి నేరుగ కుటుంబ సభ్యులతో కలసి కర్నూలు జిల్లాలోని గడివేముల గ్రామానికి వెళ్లిపోయాడు ఖాన్. కొద్ది రోజులతర్వాత స్థానికుల అభిమానాన్ని సంపాదించుకుని స్థానికంగా నివాసం ఉంటున్న ఒక విధవను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ కలసి గ్రామంలోని బీసీ కాలనీలో కాపురం పెట్టారు. ఇద్దరికీ నలుగురు సంతానం కలిగారు. ముగ్గురు ఆడ పిల్లలు, ఒక మగపిల్లాడు పుట్టారు.

తర్వాత మెల్లగా ఖాన్ తనకూ తన భార్యా బిడ్డలకూ ఆధార్ కార్డులు సంపాదించగలిగాడు. నవంబర్ 21వ తేదీన తనతోపాటుగా తన ఐదుగురు కుటుంబ సభ్యులకూ విజయవాడలోని స్థానిక పాస్ పోర్ట్ కార్యాలయం నుంచి పాస్ పోర్టులు తీసుకున్నాడు. ఆధార్ కార్డ్ , ఓటర్ ఐడీ సంపాదించిన తర్వాత అచ్చంగా భారతీయుడిలాగే నటిస్తూ తాను పాకిస్తానీ అన్న విషయాన్ని పూర్తిగా ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్తపడుతూ వచ్చాడు.

ఇంటెలిజెన్స్

ఆరు నెలల క్రితమే ఇంటెలిజెన్స్ విభాగం ఖాన్ ను పాకిస్తానీయుడిగా గుర్తించింది. ఎలాంటి అనుమతి లేకుండా తను కర్నూలు జిల్లా గడివేముల గ్రామంలో నివాసం ఉంటున్నాడని ధృవీకరించుకుని, అతన్ని అరెస్ట్ చేసేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ అప్రమత్తంగా ఉంది.

కొంతకాలం తర్వాత పొరుగు దేశంలోని కులువాల్ లో ఉన్న ఓ బట్టల వ్యాపారితో సంబంధాన్ని ఏర్పరచుకోగలిగాడు ఖాన్. తను ఖాన్ కి పాకిస్తాన్ లో ఉన్న అతని 70 సంవత్సరాల తల్లి షరీఫా బీతో మాట్లాడే అవకాశం కల్పించాడు. ఆ తర్వాత తరచూ ఖాన్ తన తల్లితో, తమ్ముడు షెహజాద్ తో, చెల్లెలు జమీలాతో, బావ అర్సలాన్ తో ఫోన్ లో సంభాషణలు జరుపుతూ వచ్చాడు. వాళ్లంతా దుబాయ్ లో ఉంటున్నారు.

నిఘా నీడలో

ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఖాన్ కదలికలమీద నిఘా పెట్టారు. ఖాన్ ఫోన్ నెంబర్ సంపాదించి కాల్ రికార్డ్స్ వెరిఫై చేశారు. తను తరచూ ఎవరితో మాట్లాడుతున్నాడో కనుక్కున్నారు. పోన్ కాల్స్ ఆధారంగా తను తన బంధువులతో ఏం మాట్లాడుతున్నాడోకూడా పోలీసులు కనుక్కోగలిగారు. నవంబర్ నాలుగో తేదీన ఖాన్ పాకిస్తాన్ కి తిరిగి వెళ్లిపోయేందుకు యాత్రికుడి వేషంలో సికింద్రాబాద్ కి వచ్చిన ఖాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

వారానికోసారి కర్నూలు నగరానికి వెళ్లి అక్కడినుంచి విదేశాల్లో ఉన్న తన కుటుంబ సభ్యులతో మాట్లాడివస్తూ ఉండేవాడు ఖాన్. పొరపాటునకూడా గడివేముల గ్రామంలో తన కుటుంబంతో ఉన్నప్పుడు, ఊళ్లో ఉన్నప్పుడు తన వాళ్లతో ఒక్క ముక్కకూడా మాట్లాడలేదు ఖాన్.

సమాచారం ఇచ్చిన ఖాన్ బావమరిది

ఖాన్ పెళ్లి చేసుకున్న విధవరాలు దౌలత్ బీ సోదరుడు నసీబ్ ఖాన్ కదలికలపై అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. అప్పటినుంచీ ఖాన్ పై నిఘా పెట్టిన పోలీసులు సమయం చూసి సికింద్రాబాద్ కి వచ్చిన అతన్ని అరెస్ట్ చేశారు. తన చెల్లెలినీ, తనకు పుట్టిన పిల్లలనూ కూడా ఖాన్ పాకిస్తాన్ కు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడన్న విషయం బావమరిదికి తెలిసింది. వెంటనే తను రైల్వే పోలీసులను ఆశ్రయించాడు.

ఈ విషయంలో తామేమీ చేయలేమని చెప్పిన కర్నూలు రైల్వే పోలీసులు నసీబ్ ని కర్నూలు టూ టౌన్ పోలీసుల దగ్గరికి వెళ్లమని చెప్పారు. నసీబ్ సమాచారం ఇవ్వగానే కర్నూలు టూ టౌన్ పోలీస్ అధికారులు స్పందించి ప్రత్యేకమైన టీమ్ ను వెంటనే కర్నూలు రైల్వే స్టేషన్ కి పంపించారు. అప్పటికే వాళ్లు ఊరు విడిచి వెళ్లిపోయి రెండు గంటలు దాటిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఖాన్ కర్నూలునుంచి నేరుగా తన కుటుంబంతో కలసి సికింద్రాబాద్ కి వెళ్లాడు.

ఇండియన్ పీనల్ కోడ్ ఫారినర్స్ యాక్ట్ 1946 కింద భారత్ లో అనుమతి లేకుండా అనధికారికంగా నివసించినందుకు, ఇండియన్ పాస్ పోర్ట్ యాక్ట్ లోని సెక్షన్ 3 ప్రకారం పాస్ పోర్ట్ లేకుండా అనధికారికంగా భారత్ లో ప్రవేశించినందుకు కేసులు నమోదు చేసిన పోలీసులు ఖాన్ ని జుడిషియల్ రిమాండ్ కు తరలించారు. అతని భార్యా పిల్లలను దగ్గరి బంధువులకు అప్పజెప్పారు.

Next Story