అక్తర్ దృష్టిలో అతడే.. ధోనీ వారసుడట..!
By Newsmeter.Network Published on 21 Jan 2020 5:04 PM ISTటీమిండియాలో అత్యుత్తమ ఫినిషర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు మహేంధ్ర సింగ్ ధోని. గెలుపు దాదాపు అసాధ్యం అన్న ఎన్నో మ్యాచుల్లో కూడా హెలికాఫ్టర్ షాట్లతో భారత్ కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ప్రపంచ కప్ తరువాత టీమిండియా ఆడే మ్యాచులకు ధోని దూరంగా ఉంటున్నాడు. ధోని రిటైర్ మెంట్ అవుతాడు అన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు..? అందరిలోనూ ఇదే ప్రశ్న. టీమిండియా మేనేజ్ మెంట్ కూడా ఈ ప్రశ్న కు సమాధానం కోసం వెతుకుతుంది. ఇప్పటికే రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, కేదార్ జాదవ్, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు అగుపడినా.. అంచనాలను అందుకోవడంలో వీరంతా చతికిల పడ్డారు.
ధోనికి సరైన వారసుడు దొరికినట్లేనని అంటున్నాడు పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ద్వారా ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడ్ని టీమిండియా కనిపెట్టగలిగిందన్నాడు. ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు అని షోయబ్ అక్తర్ అనగానే అందరికీ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ పేర్లు గుర్తొచ్చాయి. కానీ అందరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు ఈ రావల్సిండి ఎక్స్ ప్రెస్. ఓ కొత్త పేరును తెరపైకి తెచ్చాడు. అతనెవరో కాదు మనీష్ పాండే.
ధోని ఆడే ఐదో స్థానానికి మనీష్ పాండే సమర్థవంతుడని పేర్కొన్నాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టును షోయబ్ అక్తర్ యూట్యూబ్ వేదికగా అభినందించాడు. ఈ సందర్భంగా అక్తర్ తన భావాలను య్యూటూబ్ వేదికగా పంచుకున్నాడు.'ఇన్నాళ్లకు ధోని ఆడే ఐదో స్థానంలో టీమిండియా మేనేజ్‌మెంట్ సరైన ఆటగాడిని తీసుకువచ్చింది. నా దృష్టిలో మనీష్ పాండే ఐదో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. ధోని స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం మనీష్‌కు ఉంది. శ్రేయాస్ అయ్యర్ కూడా తన బ్యాటింగ్ సామర్థ్యంతో జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడంటూ' తెలిపాడు.
ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడగా కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే మనీష్ పాండే కు ఆడే అవకాశం దక్కింది. ఓ మ్యాచ్ లో 2, మరో మ్యాచ్ లో 8(నాటౌట్) పరుగులు మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శనతో ధోనికి ప్రత్యామ్నాయం మనీష్ అని షోయబ్ అక్తర్ ఏ లెక్కన అంచనా వేశాడనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. అయితే బ్యాటింగ్‌లో నిరాశపరిచిన పాండే రెండో వన్డేలో డేవిడ్ వార్నర్ క్యాచ్‌ని గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.