ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసిన పాక్‌.. జాబితాలో దావూద్‌ పేరు

By సుభాష్  Published on  23 Aug 2020 2:09 AM GMT
ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసిన పాక్‌.. జాబితాలో దావూద్‌ పేరు

ఎట్టకేలకు పాకిస్థాన్‌ ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసింది. దీంతో అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్థాన్‌ స్పష్టం చేసింది. దావూద్‌ కరాచీలోనే ఉన్నట్లు ఇమ్రాన్‌ఖాన్‌ సర్కార్‌ శనివారం ప్రకటించింది. తాజాగా ఆ దేశ ఉగ్రవాదులను గుర్తిస్తూ విడుదల చేసిన జాబితాలో ఆయన పేరును కూడా చేర్చింది. ఈ జాబితాలో కరుడుగట్టిన నేరగాళ్లు హాఫిజ్‌ సయీద్‌, మహమ్మద్‌ అజర్‌ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాకుండా పాకిస్థాన్‌కు చెందిన 88 మంది వివాదస్పద రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు తెలిపింది. పాక్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇకపై వీరందరి మీద ఆంక్షలు విధించనుంది. అంతేకాకుండా వారివారి బ్యాంకు ఖాతాలను సైతం స్థంభింపజేయనున్నట్లు తెలిపింది.

అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పాక్‌..

కాగా, ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించాలన్న అంతర్జాతీయ ఒత్తిళ్లకు పాకిస్థాన్‌ తలొగ్గి ఈ జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దావూద్‌ ఇబ్రహీంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాక్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాద గ్రూపులపై, నాయకులపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నామని, స్థిర, చరాస్థులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా వారి బ్యాంకు ఖాతాలను సైతం నిలిపివేస్తామని స్పష్టం చేసింది. అయితే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఇదంతా దేశాలను తప్పుదోవ పట్టించడానికే ఈ ప్రయత్నాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 1993లో ముంబై పేలుళ్ల కేసులు ప్రధాన సూత్రదారిగా ఉన్న దావూద్‌ ఇబ్రహీం.. అప్పటి నుంచి పాక్‌లోనే తలదాచుకుంటున్నాడు. గతంలో దావూద్‌ తమ దేశంలో లేడని కుంటిసాకులు చెప్పిన పాకిస్థాన్‌.. తాజాగా తమ దేశంలోనే ఉన్నాడని చెప్పుకొచ్చింది.

దావూద్‌ ఇబ్రహీంకు ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటలిజెన్స్‌ కమాండోల భద్రత ఇస్తున్నారని గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి. పాక్‌ ప్రధాని, ఆర్మీ ఛీఫ్‌ ప్రమేయం లేకుండా దావూద్‌ కరాచీలో ఉండే అవకాశమే లేదని ఆరోపణలున్నాయి.

Next Story