పుల్వామా ఘ‌ట‌న‌పై మాట మార్చిన పాక్ మంత్రి

By సుభాష్  Published on  30 Oct 2020 8:42 AM GMT
పుల్వామా ఘ‌ట‌న‌పై మాట మార్చిన పాక్ మంత్రి

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తమ పనేనంటూ అంగీకరించిన పాకిస్థాన్‌.. ఇప్పుడు మళ్లీ మాట మార్చింది. ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని, తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని తాజాగా పాక్‌ మంత్రి ఫవాజ్‌ చౌదురి చెప్పడం గమనార్హం. పుల్వామా దాడి తర్వాత పరిస్థితుల గురించే తాము ప్రస్తావించానంటూ ఫవాద్‌ బుకాయించారు.

కాగా, గత ఏడాది ఫిబ్రవరిలో జమ్మూలోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మందికిపైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి వెనుక పాక్‌ హస్తం ఉందని భారత్‌ వాదిస్తుండగా, పాక్‌ మాత్రం పదేపదే బుకాయిస్తూ వస్తోంది. అయితే నాటి ఘటనలో తమ ప్రమేయం ఉందని, ఇది నిజమేనని మంత్రి ఫవాద్‌ చౌదురి గురువారం ఆ దేశ పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగంలోకి వెళ్లి మరీ ఆ దేశంపై దాడి చేశామని, పుల్వామా ఇమ్రాన్‌ఖాన్‌ నాయకత్వంలో ఈ దేశం సాధించిన ఘన విజయమని చెప్పుకొచ్చారు. ఇందులో అందరూ భాగస్వాములేనని ఫవాద్‌ అన్నారు. అభినందన్‌ విడుదలకు ముందు పాక్‌ అగ్ర నాయకత్వం కాళ్లు వణికాయన్న విపక్ష నేత సాధిక్‌ వ్యాఖ్యలకు బదులిస్తూ ఫవాద్‌ చౌదురి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్‌లో తీవ్ర దుమారం

కాగా, ఫవాద్‌ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో తీవ్ర దుమారం చెలరేగడంతో తాను నోరు జారినట్లు తెలుసుకుని వెంటనే నాలుక్కరుచుకున్నారు. పుల్వామా ఘటన తర్వాత భారత భూభాగంలోకి వెళ్లి మరీ దాడి చేశాం అంటూ మాట మార్చారు. ఆ తర్వాత ట్విటర్‌ వేదికగా స్పందించిన ఫవాద్‌.. పుల్వామా దాడి తర్వాత భారత్‌తో జరిగిన వైమానిక దాడి గురించే నేను పరోక్షంగా ప్రస్తావించాను. అమాయకులను చంపి మేం ధైర్యవంతులమని చూపించుకోవాలనుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ కల్లిబొల్లి మాటలు చెప్పారు.

Next Story