'దిశ నిందితులు' ఆధార్‌లో మేజర్లు.. బోనఫైడ్‌లో మైనర్లు

By రాణి  Published on  11 Dec 2019 6:38 AM GMT
దిశ నిందితులు ఆధార్‌లో మేజర్లు.. బోనఫైడ్‌లో మైనర్లు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఎన్ కౌంటర్ లో నిందితుల వయసుపై పలు అనుమానాలు వస్తున్నాయి. నిందితుల్లో ముగ్గురి వయసు ఆధార్ లో మేజర్లుగా బోనఫైడ్ లో మైనర్లుగా ఉంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లని వారి కుటుంబసభ్యులు చెప్పడం..అందుబాటులో ఉన్న ధృవీకరణ పత్రాలు వాటికి విరుద్ధంగా ఉండటంతో నిందితుల వయసును నిపుణులు ఎలా నిర్థారిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వయసు నిర్థారణ కోసం శాస్ర్తీయ పద్ధతిని పాటించడమే ప్రామాణికంగా ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మామూలుగా ఒస్సిఫికేషన్ టెస్ట్ అంటే అస్థీకరణ పరీక్ష చేసి వయసును నిర్థారించడం ఒక ఆనవాయితీ. మనిషి వయసును నిర్థారించే ధృవీకరణ పత్రాలు సరిగా లేనపుడు అస్థీకరణ పరీక్ష చేసి వయసును తెలుసుకునే పద్ధతిని అవలంబిస్తుంటారు ఫోరెన్సిక్ వైద్యులు. సాధారణంగా 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులకు దిగువ అవయవాల ఎముక, తుంటి ఎముక ధృఢంగా ఉంటుంది. దీనిని మదించడం ద్వారా ఫోరెన్సిక్ వైద్యులు వయసును నిర్థారిస్తారు. కానీ ఇది వ్యక్తి పుట్టిన తేదీతో సహా ఖచ్చితంగా ఉండదు కానీ కొంచెం అటూ ఇటూగా ఉంటుంది. లేకపోతే ఆ ముగ్గురు నిందితుల తల్లులు గర్భవతులుగా ఉన్నపుడు అదే ఊరిలో మరెవరైనా గర్భవతులున్నారా ? అని తెలుసుకుంటే వారి వయసుపై ఓ అంచనాకు వచ్చే అవకాశాలున్నాయి.

దిశ అత్యాచార ఘటన అనంతరం నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు వారి వయసు 20 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లు నమోదు చేశారు. నిందితులు చెప్పిన వివరాల ఆధారంగానే అలా చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. దిశను అంతం చేసిన ప్రాంతంలో సీన్ రీ కన్స్ర్టక్షన్ చేస్తుండగా నిందితులు పోలీసులపై తిరగబడటంతో చేసేది లేక వారిని ఎన్ కౌంటర్ చేసినట్లు పోలీసులు చెప్పారు. కానీ తమ వారిని లంచం తీసుకుని చంపేశారని కుటుంబ సభ్యులు వాదించడంతో ఎన్ హెచ్ ఆర్ సీ ఎన్ కౌంటర్ పై నివేదిక కోరగా మంగళవారం పోలీసులు ఎన్ హెచ్ ఆర్సీకి అందజేశారు.

దిశ హత్యాచారం నిందితుల్లో శివ, చెన్నకేశవులు, నవీన్ ల పుట్టిన సంవత్సరం ఆధార్ లో 2001గా నమోదై ఉంది. వీరిలో ఇద్దరికి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్లను పరిశీలించగా అందులో మైనర్లుగా ఉంది. ఒకరి పుట్టిన తేది 15.08.2002 కాగా మరొకరిది 10.04.2004గా బోనఫైడ్ సర్టిఫికేట్లలో చూపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మరొక నిందితుని కుటుంబ సభ్యులు కూడా మంగళవారం తమ కుమారుడి బోనఫైడ్ సర్టిఫికేట్ ను సేకరించారు. అందులో 04.04.2004గా నిందితుడి పుట్టిన తేదీ నమోదై ఉంది. బోనఫైడ్ సర్టిఫికేట్ల ఆధారంగా చూస్తే నిందితుల్లో ముగ్గురు మైనర్లున్నట్లుగా తెలుస్తోంది. మీ కుమారులు మైనర్లైతే అందుకు సంబంధించిన ధృవపత్రాలివ్వాలని ఎన్ హెచ్ ఆర్ సీ సూచించడంతో ఈ సర్టిఫికేట్లను నిందితుల కుటుంబ సభ్యులు వాట్సాప్ ద్వారా వారికి పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Next Story
Share it