దిశ హత్యాచార ఘటనపై ఎన్‌హెచ్ఆర్సీ కి నివేదిక

By రాణి  Published on  10 Dec 2019 8:41 AM GMT
దిశ హత్యాచార ఘటనపై ఎన్‌హెచ్ఆర్సీ కి నివేదిక

హైదరాబాద్ : దిశ హత్యాచార ఘటనపై తెలంగాణ సైబరాబాద్ పోలీసులు ఎన్ హెచ్ ఆర్సీ (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్)కి ఫోరెన్సిక్ ఆధారాలతో కూడిన నివేదిక అందజేశారు. సంఘటన స్థలంలో దొరికిన రక్తం మరకలను, లారీ క్యాబిన్లో దొరికిన రక్తం మరకల ఫొటోలను, కొత్తూరు సమీపంలో నిందితులు పెట్రోల్ కొనుగోలు చేసిన సీసీ ఫుటేజీని, రక్తపు మరకల డీఎన్ఏ రిపోర్ట్ నివేదికకు జత చేశారు. జత గత నెల 27వ తేదీన దిశ కిడ్నాప్, ఆపై అత్యాచారం, కాల్చివేతపై నివేదికలో వివరాలు పొందుపరిచారు.

అలాగే ఈ నెల 6వ తేదీన జరిగిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. త్వరలో ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని సిట్ బృందం పరిశీలించనుంది. మరోవైపు ఈ కేసులో ఏ1, ఏ2, ఏ3, ఏ4 నిందితులుగా ఉన్న మహమ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవుల మృతదేహాలను ఈనెల 13వ తేదీ శుక్రవారం వరకూ గాంధీలో భద్రపరచాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దిశను లారీలో తరలిస్తున్న వీడియో ఫుటేజ్ ఈ కేసు విచారణకు కీలక ఆధారమయింది. కాగా దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో గురువారం హైకోర్టు దాఖలైన పిటిషన్లపై విచారణ చేపడుతామని ఉన్నత న్యాయస్థానం గురువారానికి కేసు విచారణను వాయిదా వేసింది.

Next Story