అమూల్ బేబీకి ఆస్కార్ తిరస్కారం

By రాణి  Published on  13 Feb 2020 5:11 AM GMT
అమూల్ బేబీకి ఆస్కార్ తిరస్కారం

అద్భుతమైన సెన్సాఫ్ హ్యూమర్ కి అమూల్ అడ్వర్టయిజ్ మెంట్లు పెట్టింది పేరు. సమయానికి తగినట్టు, ట్రెండీ యాడ్లతో అమూల్ ప్రతీ సారీ అలరిస్తూనే ఉంటుంది. కానీ తాజాగా అమూల్ వెలువరించిన యాడ్ మాత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఆస్కార్ ఉత్తమ నటుడు జొవాకిమ్ ఫీనిక్స్ పైన అమూల్ ఓ యాడ్ ను విడుదల చేసింది. హాలీవుడ్ చిత్రం జోకర్ లో నటించిన జోవాకిమ్ కి అమూల్ బేబీ బట్టర్ తినిపిస్తున్నట్టుగా ఒక కార్టూన్ వేసి అతని పేరులోని కొంత భాగాన్ని తీసుకుని, జోవాకర్ అని పన్ తో ఫన్ సృష్టించేందుకు ప్రయత్నించింది.

అదిగో ... అక్కడే ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. జొవాకిమ్ జంతు ఉత్పాదనలేవీ వాడడు. ఆఖరికి పాలు, పెరుగు కూడా. జంతువులు తమ లేగల కోసం దాచుకున్న తమ పాలను మనిషి తాగడం మహానేరం అని జోవాకిమ్ ఫీనిక్స్ పదేపదే చెబుతూ ఉంటాడు. ఇటీవల ఉత్తమనటుడిగా ఆస్కార్ పురస్కారాన్ని తీసుకున్న సమయంలోనూ ఇదే మాట అన్నాడు. “ప్రకృతికి చేరువ కావాలి. మనమే ప్రపంచానికి కేంద్ర బిందువని మానవాళి పొరబాటు పడుతోంది. మనం ప్రకృతిని దోచుకుంటున్నాం. పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నాం. ఆవులకు కృత్రిమ వీర్యాన్నిచ్చి, వాటి సంతానాన్ని వాటికి చెందకుండా చేస్తున్నాం. సంతానం కోసం దాచిన పాలను దోచుకుంటున్నాం. మనం ఆ పాలను కాఫీలో, వంటకాల్లో కలుపుకుంటున్నాం. ఇంతకన్నా క్రౌర్యం ఏముంది?” అని జోవాకిమ్ ఫీనిక్స్ తన ఆస్కార్ ప్రసంగంలో అన్నాడు.

అలాంటి ఆస్కార్ విజేత ఆశయాలకు విరుద్ధంగా ఆయనకు అమూల్ బేబీ పాల ఉత్పత్తులను తినిపించడం ఏమిటని ఇప్పుడు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా జంతువుల పట్ల హింసను వ్యతిరేకించే సంస్థ పేటా అమూల్ ను టాగ్ చేస్తూ ఒక ట్వీట్ కూడా పంపింది. ఆవు పాల కన్నా సోయా పాలు, బాదం పాలు, ఓట్స్ మిల్క్ ల ఉత్పాదనపై దృష్టి పెట్టండి అని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చింది. జొవాకిమ్ పూర్తి స్థాయి శాకాహారి. ఆయన పాలు తాగరు అని పేటీ పీ ఆర్ అధికారి సచిన్ రంగేరా కూడా ట్వీట్ చేశాడు. పాలు తెచ్చిన తంటాలతో ఇప్పుడు అమూల్ సంస్థ తలలు పట్టుకుని కూర్చుంది.

Next Story