ఆడాళ్లూ జాగ్రత్త!! ఆన్ లైన్ షాపింగ్ లో మగాళ్లదే పైచేయి!!!

By Newsmeter.Network  Published on  20 Dec 2019 12:39 PM GMT
ఆడాళ్లూ జాగ్రత్త!! ఆన్ లైన్ షాపింగ్ లో మగాళ్లదే పైచేయి!!!

ఆడాళ్లు షాపింగ్ కి వెళ్తే అంతే సంగతులు. ఉన్న చీరలన్నీ తీయించి చూస్తారు. డిజైన్లు, రంగులు, హంగులని షాపుని మొత్తం చిందరవందర చేస్తారు. మగాళ్ల జేబులకు చిల్లులు పెట్టేస్తారు. నూటికి నూటొక్క శాతం మంది అభిప్రాయం ఇదే. కానీ ఒక్క నిమిషం ఆగండి. మీది తప్పుడు అభిప్రాయం. ఆన్ లైన్ దుకాణాల్లో మాత్రం మగాళ్లదే డామినేషన్. ఒక్క క్లిక్కుతో షాపింగ్ చేయడంలో ఆడాళ్లను మగాళ్లు అవలీలగా ఓడించేస్తారని మార్కెట్ రీసెర్చి సంస్థ నీల్సన్స్ ఇటీవలే నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడించింది.

ఈ అధ్యయనం ప్రకారం మొత్తం ఆన్ లైన్ దుస్తుల కొనుగోలులో 58 శాతం మగాళ్లే చేస్తారు. మహిళలు కేవలం 36 శాతమే ఆన్ లైన్ కొనుగోళ్లు చేస్తారట.

దేశంలోని ఎనిమిది ప్రధాన మెట్రో నగరాలు, టియర్ 1 నగరాల్లో ఇదే పోకడ కానవచ్చింది. మెట్రోలు మొత్తం దుస్తుల కొనుగోళ్లలో 29 శాతం వరకూ చేస్తే, టియర్ 1 నగరాలు 71 శాతం కొనుగోళ్లు చేస్తాయి. చిన్న పిల్లల దుస్తుల కొనుగోలు మొత్తం దుస్తుల కొనుగోళ్లలో అయిదు శాతం వరకూ ఉంటాయి. యువత బ్రాండ్లకు పడిపోతున్న ఈ రోజుల్లో ఈ కామర్స్, ఆన్ లైన్ కొనుగోళ్లు నానాటికీ పెరుగుతున్నాయి. చాలా ఫ్యాషన్ బ్రాండ్లు ఇప్పుడు కేవలం ఆన్ లైన్ ద్వారానే అమ్మకాలు చేస్తున్నాయి. అయితే ఆన్ లైన్ కొనుగోలుదారుల ప్రవర్తన, వారి కొనుగోలు చాయిస్ ల గురించి వ్యాపారులకు తెలిసింది చాలా తక్కువ, తెలసుకునే మార్గాలు కూడా తక్కువే. దుస్తుల తో పాటు, ఫుట్ వేర్, ఫ్యాషన్ యాక్సెసరీల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ఫుట్ వేర్ అమ్మకాలు మొత్తం అమ్మకాల్లో 23 శాతం, యాక్సెసరీలు 17 శాతం ఉంటాయి. అయితే ఎక్కువగా మొబైల్ ఫోన్లను కొనడం జరుగుతోంది. ఆన్ లైన్ లో 48 శాతంతో ఫోన్ల అమ్మకాలు ఉంటే, ఫ్యాషన్ రెండో స్థానంలో ఉంది.

ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఎక్కువగా ఆన్ లైన్ కొనుగోళ్లు రాత్రి 8 నుంచి 11 గంటల మధ్యలో జరుగుతాయి. ఉద్యోగాలనుంచి ఇంటికి వచ్చి, తీరికగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కొనుగోళ్లు జరుగుతున్నాయి. పండుగల సమయంలోనే ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతాయని కూడా సర్వే చెబుతోంది. ఉదాహరణకు ఈ పండుగ సీజన్ లో అమెజాన్, ఫ్లిప్ కార్టులు 31000 కోట్ల మేరకు లావాదేవీలు జరిపాయి. చాలా మంది పండుగ సీజన్ దాకా కొనుగోలు చేయకుండా వేచి చూస్తారని కూడా సర్వే చెబుతోంది. అందుకే బిగ్ డే సేల్స్ అంత పాపులర్ అయ్యాయన్న మాట. మొత్తం కొనుగోళ్లలో 84 శాతం ఈ సమయంలోనే జరిగిందని కూడా నీల్సన్స్ ధ్రువీకరించింది.

Next Story