మరింత పెరగనున్న ఉల్లి ధరలు ?
By రాణి Published on 25 Dec 2019 6:34 AM GMT
ముఖ్యాంశాలు
- భారత్ కు ఉల్లి ఎగుమతి చేయకుండా టర్కీ ప్రభుత్వం నిషేధం
- టర్కీ మార్కెట్లో ధరలు పెరగడమే కారణమా ?
ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలు రానున్నాయా ? అంటే అవుననే అంటున్నాయి కొన్ని వ్యాపార వర్గాలు. నిన్న మొన్నటి వరకూ దేశ వ్యాప్తంగా డిమాండ్ కు అనుకూలంగా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగి కిలో రూ.200 ఎక్కి కూర్చుంది ఉల్లి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా నుంచి ఉల్లి ఎగుమతులపై నెలరోజులపాటు నిషేధం విధించింది. ఉల్లి సంక్షోభం ఏర్పడటంతో ఈజిప్టు, టర్కీ నుంచి భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7,070 టన్నుల ఉల్లి భారత్‌కు వచ్చింది. అందులో టర్కీ నుంచి 50 శాతానికి పైగా కొనుగోలు చేసినట్లు వ్యాపారులు వర్గాలు చెబుతున్నాయి.
దిగుమతుల తర్వాత ఉల్లి ధరలు కొద్దికొద్దిగా తగ్గుతూ..బహిరంగ మార్కెట్లో నాణ్యమైన ఉల్లిపాయల ధర కిలో రూ.120 నుంచి రూ.150 వరకూ పలుకుతోంది. అయితే తాజాగా టర్కీ నుంచి ఇండియాకి ఎగుమతి చేసేందుకు పోటీ నెలకొనడంతో అక్కడి మార్కెట్ లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయట. దీంతో అక్కడి ప్రభుత్వం ఇండియాకు ఉల్లిని ఎగుమతి చేయకుండా నిషేధం విధించినట్లు తెలుస్తోంది.
రెండు దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటేనే ఉల్లి ధర రూ.120 ఉందంటే...50 శాతం దిగుమతి తగ్గితే మళ్లీ ఉల్లి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ భారం మళ్లీ సామాన్య ప్రజలపైనే పడనుంది. డిసెంబర్ 26లోగా మరో 4,500 టన్నులు ఉల్లి వస్తుందని దీంతో ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని వ్యాపారుల అంచనా. కానీ ఎంత దిగుమతి ఉన్నా వ్యాపారులు మాత్రం ఉల్లి ధరలు పెరిగినప్పుడు నాణ్యమైనవి, తగ్గినపుడు కుళ్లిన ఉల్లిపాయలు అమ్ముతూ..ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. రైతు బజార్లలో ఆధార్ కార్డుమీద ఇచ్చే సబ్సిడీ ఉల్లిపాయలు కూడా ఇలాగే ఉంటున్నాయి.