రివ్యూ : 'ఒక చిన్న విరామం' - పూర్తిగా విరామం తీసుకోవచ్చు

By రాణి  Published on  14 Feb 2020 12:21 PM GMT
రివ్యూ : ఒక చిన్న విరామం - పూర్తిగా విరామం తీసుకోవచ్చు

సంజయ్ వర్మ, గరీమ సింగ్ హీరో హీరోయిన్లుగా పునర్నవి భూపాళం, నవీన్ నేని ముఖ్య పాత్రలుగా సందీప్ చేగురి నిర్మాతగా..దర్శకత్వం వహించిన చిత్రం 'ఒక చిన్న విరామం'. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం వెండితెర ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

దీపక్ (సంజయ్ వర్మ)కు ఒక అపరిచిత వ్యక్తి నుండి అనుమానాస్పద కాల్ వస్తుంది. తాను డబ్బు కోసం దీపక్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. డబ్బును ఇవ్వడానికి దీపక్ కార్ లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. దారిలో కార్ రిపేర్ అవుతుంది. అంతలో ఆ అపరిచిత వ్యక్తి దీపక్ కు ప్రతి అరగంటకు ఒకసారి కాల్ చేసి ఇబ్బంది పెడుతుంటారు. అసలు ఇంతకీ ఆ అపరిచితుడికి దీపక్ కి ఉన్న సంబంధం ఏమిటి ? దీపక్ చివరికి ఏం చేశాడు ? ఈ కథలో అసిస్టెంట్ డైరెక్టర్ బాలా (నవీన్ నేని), మాయ (పునర్నవి భూపాలం), సమీరా (గరీమ సింగ్) కథలోకి ఎలా వచ్చారు ? చివరికి వీరందరూ ఏం సాధించారు ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఒక చిన్న విరామం చూడాల్సిందే.

నటీనటులు :

ఈ సినిమాలో హీరోగా నటించిన సంజయ్ వర్మ కొన్ని కీలక సన్నివేశాల్లో కొంత తడబాటు పడ్డా.. చాలా వరకు కాన్ఫిడెంట్ గా నటించాడు. తన నటనతో పాటు తన డైలాగ్ మాడ్యులేషన్ తోనూ సంజయ్ వర్మ ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. మెయిన్ గా కొన్ని కన్ ఫ్యూజ్డ్ అండ్ సీరియస్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. ఇక సంజయ్ వర్మ సరసన హీరోయిన్ గా నటించిన గరీమ సింగ్ తన హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. విలన్ గా నటించిన నటుడు కూడా ఉన్న ఒకటి రెండు సీన్స్ లో బాగానే మెప్పించాడు.

అలాగే మరో హీరోయిన్ గా కనిపించిన పునర్నవి భూపాళం తన గ్లామర్ తోనే కాకుండా.. తన లుక్స్ పరంగా, నటన పరంగా కూడా బాగానే ఆకట్టుకుంటుంది. కమెడియన్ నవీన్ నేని తన కామెడీ టైమింగ్ తో సినిమాకే హైలైట్ గా నిలిచాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడికి మంచి విజువల్ సెన్స్ అలాగే కామెడీ సెన్స్ కూడా ఉందని కొన్ని సీన్స్ లో నిరూపించుకున్నాడు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు భరత్ మాచిరాజు అందించిన సంగీతం జస్ట్ పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ట్రీమ్ చేసి చేయాల్సింది. రోహిత్ బెచు సినిమాటోగ్రఫీ చాల బాగుంది. సినిమాకే రోహిత్ బెచు వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విజువల్స్ ను ఆయన చాలా అందంగా చూపించారు. దర్శకుడు సందీప్ చేగురి సరైన స్క్రిప్ట్ ను రాసుకోవడంలో విఫలం అయ్యారు. ఆయన దర్శకత్వం పర్వాలేదు. ఇక నిర్మాతగా కూడా సందీప్ చేగురి పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కథకు అవసరమైనంత ఖర్చు పెట్టారు.

అయినా ఇలాంటి డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమా ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. దర్శకుడు సెకండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. దీనికి తోడు మెయిన్ గా సినిమా గందరగోళంగా సాగుతూ బోర్ కొడుతోంది.

సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా బలహీనమైన ఎమోషన్ కి లోబడి బలహీనంగా సాగడం కూడా బాగాలేదు. పైగా సినిమాలో చాల సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. మొత్తంగా సినిమాను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ.. స్క్రిప్ట్ వీక్ గా ఉండటం కారణంగా అది సాధ్యపడలేదు. అందుకే సినిమాలో దర్శకుడు తీసుకున్న కథాంశం బాగున్నా..కథా కథనాలు ఆసక్తికరంగా సాగవు.

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్.

పునర్నవి భూపాళం, నవీన్ నేని లవ్ ట్రాక్.

మైనస్ పాయింట్స్ :

కథాకథనాలు,

సెకండాఫ్ లో అక్కడక్కడా సాగే సన్నివేశాలు.

స్లో సాగే లాజిక్ లెస్ స్క్రీన్ ప్లే

అంతగా మెప్పించనిలేని దర్శకత్వ పనితనం

ఆసక్తికరంగా మరియు బలంగా లేని క్లైమాక్స్

తీర్పు :

థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. దర్శకుడు పేపర్ మీద రాసిన స్క్రిప్ట్ ను స్క్రీన్ మీదకు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. పైగా ఆకట్టుకోని కథనం, ఆసక్తికరంగా సాగని సన్నివేశాలు, క్లారిటీ లేని పాత్రలు, నవ్వు రాని కామెడీ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఓవరాల్ గా ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని కూడా నిరుత్సాహ పరుస్తోంది. కాబట్టి ఈ 'చిన్న విరామం'కు పూర్తి విరామం తీసుకోవచ్చు.

రేటింగ్ : 1.25 / 5

Next Story