పులి తెలివికి ఆశ్చర్యపోతున్న అధికారులు.. ఆ పులి ఏం చేసింది..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2019 6:52 AM GMT
పులి తెలివికి ఆశ్చర్యపోతున్న అధికారులు.. ఆ పులి ఏం చేసింది..?

ముఖ్యాంశాలు

  • అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో పులి పిల్లల సందడి
  • కెమెరాల వైపు రాకుండా జాగ్రత్త పడుతున్న పెద్ద పులి

సౌత్‌ ఇండియాలోనే అతి పెద్దదైన నల్లమలలోని అమ్రాబాద్‌ అభయారణ్యంలో పులిపిల్లలు సందడి చేస్తున్నాయి. నల్లమలలో జాతీయ జంతువు పెద్ద పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమ్రబాద్‌ టైగర్‌ రిజర్వులో ఇప్పటి వరకు 20 పెద్ద పులులు ఉండగా వాటికి తోడుగా మరో రెండు పులి పిల్లలు జత కలిశాయి. నాగర్‌ కర్నూలు జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన ఫర్హాబాద్‌ వ్యూ పాయింట్‌ వద్ద తల్లి పులితో రెండు పులి పిల్లలు సందడి చేస్తుండగా కెమెరాలకు చిక్కాయి.

తల్లి పులి ఎక్కువగా ఫర్హబాద్‌ వ్యూపాయింట్‌లో కనిపిస్తుండటంతో ఫారెస్ట్‌ అధికారులు దానికి 'ఫర్హా' పేరు పెట్టారు. పుల్లాయిపల్లి బేస్‌క్యాంప్‌లోని బౌరమ్మ గుడి వద్ద గత ఏడాది ఫర్హాకు రెండు పిల్లలు పుట్టాయి. ఆడ పులికి బౌరమ్మగా, మగ పులికి పుల్లయ్యగా ఫారెస్ట్‌ అధికారులు నామకరణం చేశారు. పులి పిల్లలను పర్యవేక్షించేందుకు ఫారెస్ట్‌ అధికారులు 45 కెమెరాలను ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల పాటు పులి పిల్లలు కనిపించకపోవడంతో ఫారెస్ట్‌ అధికారులు కలవర పడ్డారు. కెమెరాల ముందు ఏదైనా జీవి కదిలితే ఫ్లాష్‌ వస్తుంది. దీంతో ఏదో ప్రమాదం పొంచి ఉందన్న భావనతో పులి కెమెరాల వైపు రాకుండా జాగ్రత్త పడుతోంది. దీంతో ఫారెస్ట్‌ అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

పులి పిల్లలు, తల్లి పులిని ఫర్హాను 10 మంది వాచర్లు, ఐదుగురు ఫారెస్ట్‌ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని నాగర్‌కర్నూల్‌ డీఎఫ్‌ఓ జోజి తెలిపారు. పులి పిల్లలు పెద్ద పెరిగాక తల్లి పులి నుంచి విడిపోతాయన్నారు. పెద్ద పులుల సంరక్షణకు ఫారెస్ట్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పకృతి సురక్షితంగా ఉండాలంటే అడవులు, అటవీ ప్రాణులు ఎంతో అవసరం.

Next Story