కరోనా పై అధికారులను హెచ్చరించిన కిమ్

By రాణి  Published on  29 Feb 2020 6:01 AM GMT
కరోనా పై అధికారులను హెచ్చరించిన కిమ్

చైనాను గడగడలాడించిన కరోనా వైరస్ (కోవిడ్ 19) ఇప్పుడు దక్షిణ కొరియాపై విరుచుకు పడుతోంది. చైనాలో వైరస్ తీవ్రత తగ్గుతుండటంతో అక్కడి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తగ్గింది కదా అనుకునే లోపే అది కాస్తా దక్షిణ కొరియాపై దాడి చేసింది. శుక్రవారం కొత్తగా 594 మందికి వైరస్ సోకినట్లు నిర్థారణవ్వడంతో ఇప్పటి వరకూ కరోనా బాధితుల సంఖ్య 2,931కి చేరింది. వైరస్ ప్రభావంతో దేగు ప్రాంతంలో ముగ్గురు మృతి చెందగా..కరోనా మృతుల సంఖ్య 16కి చేరింది. చైనాలో శుక్రవారం 47 మంది ప్రాణాలు కోల్పోగా..వారిలో 45 మంది హుబెయ్ ప్రావిన్సుకు చెందినవారే. కొత్తగా 427 మందికి వైరస్ సోకడంతో..అక్కడ కరోనా బాధితుల సంఖ్య 79,251కి చేరుకుంది.

దక్షిణ కొరియాలో కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువవుతుండటంతో..ఉత్తర కొరియా ముందుగానే అప్రమత్తమైంది. ఇప్పటి వరకూ ఆ దేశంలో ఎలాంటి కరోనా కేసు నమోదవ్వలేదు. కానీ..అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కరోనా వైరస్ దేశంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో విఫలమైతే గనుక తీవ్రపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు కూడా. హెచ్చరించడమేమిటి..వ్యాధిని అరికట్టే చర్యల్లో ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపణలొచ్చిన అధికార వర్కర్స్ పార్టీ వైస్ చైర్మన్ రీ మాన్ గొన్, పాక్ తే డొక్ లను పదవుల నుంచి తప్పించారట. వైరస్ దేశంలోకి వచ్చే అన్ని మార్గాలను మూసివేయాలని కిమ్ సూచించారు. అలాగే దక్షిణ కొరియా, చైనా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ముందుగా పరిశీలించాలని..ఎవరికి వ్యాధి లక్షణాలున్నా వారిని తిప్పి వెనక్కి పంపాలని తెలిపారు.

Next Story