పాత సీసాలో కొత్త సారా పోసినట్టుంది 'బడ్జెట్'

By Newsmeter.Network  Published on  1 Feb 2020 2:06 PM GMT
పాత సీసాలో కొత్త సారా పోసినట్టుంది బడ్జెట్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పై టీఆర్‌ఎస్‌ పార్టీ పెదవి విరిచింది. ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఊహించిన దాని కంటే భిన్నంగా ఉందని టీఆర్‌ఎస్‌ పార్టీ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాజెక్టుల మంజూరు, నిధులు కేటాయింపులు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు బంధు పథకంతో రైతులకు సహాయం చేస్తోందని తాజా ఆర్థిక సర్వే తెలిపింది.. కానీ బడ్జెట్‌లో ఆ పథకానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. విభజన హామీలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవని, దేశంలోనే గొప్ప ప్రాజెక్టైన కాళేశ్వరానికి కూడా నిధులు కేటాయించలేదని, ఇండస్ట్రీయల్‌ కారిడర్‌ విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు.

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తారని భావించగా నిరాశే కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని విమర్శించారు. బడ్జెట్‌లో తాము కోరిన 22 అంశాలకు కేటాయింపులు ఉంటాయని భావించామని చెప్పారు. హర్ ఘర్ జల్ అన్నారని.. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ముందే అమలు చేశారని తెలిపారు. విభజన హామీల ప్రస్తావనే లేదని, పాత సీసాలో కొత్త సారా పోసినట్టు బడ్జెట్ ఉందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు.

కేంద్ర బడ్జెట్ అంకెల గారడిగా ఉందని, రైతులను కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు రాజ్యసభ సభ్యులు, బడుగుల లింగయ్య యాదవ్. బడ్జెట్లో జీఎస్టీ బకాయిల అంశం లేదని, తెలంగాణలోని అనేక సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నారన్నారు. ప్రపంచ స్థాయి ప్రాజెక్టు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరామని, విభజన హామీల ప్రసక్తే లేదని తెలిపారు. రాష్ట్రాలు బాగుంటేనే కేంద్రం బాగుంటుందన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా పోరాడాలని కోరారు.

Next Story