కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. కేరళ రాష్ట్రంలో కూడా ముగ్గురికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించబడింది. ముఖ్యంగా ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపించే అవకాశాలే ఎక్కువ.. అందుకే ముందు జాగ్రత్త చర్యలు అధికారులు చేపట్టారు. కేరళ రాష్ట్రంలో దాదాపు 3000 మందికి ఈ వైరస్ సోకిందేమోనన్న అనుమానాలతో అందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వైరస్ వ్యాప్తి చెందకుండా మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపట్టారు అక్కడి అధికారులు. కేరళ పోలీసులు కూడా బ్రీత్ అనలైజర్ టెస్టును ప్రస్తుతానికి ఆపేసినట్లు తెలుస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో భాగంగా చేసే బ్రీత్ అనలైజర్ టెస్టును కొద్దిరోజుల పాటూ ఆపివేస్తే బాగుంటుందని పోలీసు యంత్రాంగం ఈ నిర్ణయానికి వచ్చింది.

కొద్దిరోజుల పాటూ బ్రీత్ అనలైజర్ టెస్టును ఆపివేయాలంటూ ఆ రాష్ట్ర పోలీసు ఛీఫ్ లోకనాథ్ బెహరా ట్రాఫిక్ యంత్రాంగానికి సర్కులర్ పంపారు. వెహికల్ చెకింగ్ లు అన్నీ జరుగుతాయని, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కు సంబంధించి కూడా పరీక్షలు ఉంటాయని.. ఒక్క బ్రీత్ అనలైజర్ టెస్టు మాత్రమే కొద్దిరోజుల పాటూ నిలిపిస్తున్నామని అందులో తెలిపారు. రాష్ట్రంలో ఎక్కువగా రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదాలకు కారణం మద్యం తాగి వాహనాలను నడపడమే.. ఈ ప్రమాదాలు జరగకుండా కేరళ పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్టులు నిర్వహించే వారు. కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పలు చర్యలు చేపట్టారు. ఎవరికైనా వైరస్ లక్షణాలు సోకినట్లు అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలంటూ సూచనలు ఇస్తున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.