ఆ అబ్బాయి “చల్ మోహన రంగా” అనుకునే టైప్. అమ్మాయిని చూడగానే అబ్బాయి “దిల్” లో గంట మోగింది. “గుండె జారి గల్లంతయ్యింది.” ఆ తరువాతే “ఇష్క్” మొదలైంది. “చిన్న దానా నీ కోసం” ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు. అమ్మాయిని కలవకపోతే “హార్ట్ ఎటాక్” వచ్చేంత పరిస్థితి వచ్చింది. ఇంకేముంది “రెచ్చిపో” అనుకున్నాడు. ఇక “అల్లరి బుల్లోడు”  ఒకరోజు “చిన్నదానా నీ కోసం” అని “ధైర్యం” చేసి మనసు మూట ఆమె ముందు విప్పేశాడు. అమ్మాయి “అ … ఆ” అనలేదు. ఓకే అంది. అబ్బాయికి “విక్టరీ” అంటే “జయం” వచ్చేసింది. ఇంకా నెక్స్ ఏంటి అనుకుంటున్నారా? ఇంకేముంది? “ఇక శ్రీనివాసకళ్యాణమే”

టూకీగా మన లవర్ బాయ్ నితిన్ ప్రేమ కథ ఇది. నితిన్ శాలిని కందుకూరిని ఇలాగే ప్రేమించాడు. ఎనిమిదేళ్లుగా దోస్తీ. కానీ అయిదేళ్లుగానే ప్రేమ మొలకలెత్తింది. కానీ డ్యూయెట్లు, గ్రూప్ డాన్సర్లు, డేటింగ్ లు, మీటింగులు ఏవీ లేవు. ఒకరి తోడు ఇంకొకరికి నచ్చింది. కలుస్తూ ఉండేవారు. నితిన్ నటించిన కొత్త సినిమాల్లో లాగా మోకాలిపై కూర్చుని ఒక పువ్వునిచ్చి “విల్యూ మ్యారీ మీ” అని అడగలేదు. పాత సినిమాల్లో ఒకరంటే ఇంకొకరికి ఇష్టం ఏర్పడింది. చెప్పకుండానే ఒకరంటే ఒకరికి ప్రేమ పుట్టింది. ప్రపోజులు చేసుకోకుండా ఒకరిని ఒకరు మనసుల్లోనే ఒప్పేసుకున్నారు. కాబట్టి ప్రపోజ్ చేయడం జస్ట్ ఒక ఫార్మాలిటీ అయిపోయింది. చివరికి ఒక రోజు నిఖిల్ ఒంటికాలు మీద నిలబడి తపస్పు చేసినంత పని చేసి, ప్రపోజ్ చేశాడు. అందుకోసమే వెయిట్ చేస్తున్నట్టుగా శాలిని ఓకే అనేసింది.

శాలిని యూకేలో బిజినెస్ మేనేజ్ మెంట్ చేసింది. మిత్రుల ద్వారా నితిన్ కి పరిచయమైంది. మొదట్లో నితిక్ కి పెద్దగా ఏమీ అనిపించలేదు. అయితే శాలిని అందగత్తె. కానీ చాలా నిదానమైనది. మంచి గ్లామరస్. కానీ అహంకారం అస్సలే లేదు. ఆ అమ్మాయిది మంచి చిరునవ్వు. ఆమెను ప్రేమించకుండా ఎవరూ ఉండలేరు. నితిన్ కూడా అదే అయిపోయాడు. “ మా ఇద్దరిదీ మంచి మెచ్యూర్ రిలేషన్ షిప్. ఇందులో పిల్ల చేష్టలేమీ లేవు.” అంటాడు నితిన్. ఇద్దరు తమ తమ కుటుంబాలకు విషయం చెప్పారు. పెద్దలు ఓకే అన్నారు. సినీ నటుడైనా సినిమాటిక్ ట్విస్టులేవీ లేకుండా అంతా ఓకే అయిపోయింది.

శాలిని నితిన్ సినిమాలన్నీ చూసేసింది. ఆమెకు అన్ని సినిమాలూ బోల్డు నచ్చేశాయి. అయితే అందులో టాప్ త్రీ సినిమాలు ఏమిటంటే ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, అ… ఆ…

అసలు శాలిని పేరు చెప్పగానే నితిన్ కళ్లలో ఒక కొత్త వెలుగు వస్తుంది. తెలియకుండానే ఒక నవ్వు ఈ చెవి నుంచి ఆ చెవి దాకా విస్తరించేస్తుంది. ఈ ఒక్కటి చాలు వారిద్దరి లైఫ్ బ్రహ్మాండంగా ఉండబోతోందని చెప్పడానికి. ఆల్ ది బెస్ట్ నితిన్, శాలిని.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.