ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడుతుందన్న ధీమాలో నిర్భయ దోషులు

By రాణి  Published on  23 Jan 2020 10:06 AM GMT
ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడుతుందన్న ధీమాలో నిర్భయ దోషులు

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు తీహార్ జైలులో ఉరి తీయాలని ఢిల్లి కోర్టు ఇటీవలే కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం తీహార్ జైలు అధికారులు దోషులను ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే చెప్పాల్సిందిగా ప్రశ్నించారట. అందుకు దోషులు బదులేమీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారని అక్కడి జైలువర్గాలు వెల్లడించాయి. అంతేకాక వారంతా ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడుతుందన్న ధీమాతో ఉన్నట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నాయి.

నిజానికి ఎక్కడైనా మరణశిక్ష పడిన దోషులను జైలు అధికారులు చివరి కోరికలేమైనా ఉంటే అడగడం సహజం. కుటుంబ సభ్యులను కలుసుకోవాలనో, నచ్చిన ఆహారం తినాలనో, లేకపోతే వారి పేరుమీద ఉన్న ఆస్తులను తమకిష్టమైన వారికిచ్చేలా చేయాలనో...అడగచ్చు. కానీ నిర్భయ దోషులు మాత్రం నోరు విప్పకపోవడంపై జైలు వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు దగ్గర పడే సమయంలోనే ఎవరో ఒకరు క్షమాభిక్ష పెట్టడం..దానిని రాష్ర్టపతి తిరస్కరించడం. లేకపోతే కోర్టు పిటిషన్ వేయడం..దానిని కోర్టు కొట్టివేయడం..ఇలాంటి పనులతో నిందితుల ఉరిశిక్ష ఎప్పకప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి డిసెంబర్ నెలలోనే వీరికి ఉరిశిక్ష పడాల్సి ఉండగా..నిందితుల్లో ఒకడైన అక్షయ్ తనకు ఉరిశిక్ష నుంచి విముక్తి కలిగించాలని పిటిషన్ పెట్టడంతో దానిని ఢిల్లీ హైకోర్టు కొట్టివేస్తూ..జనవరి 22న ఉరిశిక్ష వేయాలని ఆదేశాలిచ్చింది. ఇప్పుడు పవన్ గుప్తా రాష్ర్టపతికి క్షమాభిక్ష పెట్టుకోగా..ఆయన కూడా దానిని తిరస్కరించారు. క్షమాభిక్ష తిరస్కరించినా..పిటిషన్ కొట్టివేసినా...ఉరిశిక్ష అమలు తేదీని వాయిదా వేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ రెండుసార్లు ఉరిశిక్ష వాయిదా పడింది. ఫిబ్రవరి 1వ తేదీన కూడా నిర్భయ నిందితులను ఉరి తీస్తారన్న నమ్మకం లేదు. మళ్లీ నిందితుల్లో ఎవరైనా క్షమాభిక్ష కోసమో...లేకపోతే ఉరిశిక్ష నుంచి విముక్తి కలిగించాలని అప్పీల్ చేసినా శిక్ష వాయిదా పడే అవకాశాలే ఎక్కువ.

శిక్ష నుంచి తప్పించుకోలేకపోయినా...ఆ శిక్షను ఎలా వాయిదా వేయించాలన్న దాని గురించే నిందితులు ఎక్కువగా ఆలోచిస్తున్నట్లున్నారు. అందుకే సరిగ్గా శిక్ష అమలు సమయం దగ్గర పడుతున్నప్పడే..నిందితులు తెలివిగా క్షమాభిక్ష కోరేందుకు ప్లాన్లు వేస్తున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు.

Next Story
Share it