నిర్భయ కేసు.. మళ్లీ కోర్టు మెట్లెక్కిన నిందితుడు ముఖేష్‌..

By అంజి  Published on  27 Jan 2020 6:53 AM GMT
నిర్భయ కేసు.. మళ్లీ కోర్టు మెట్లెక్కిన నిందితుడు ముఖేష్‌..

ఢిల్లీ: నిర్భయ దోషి ముఖేష్‌ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రపతి క్షమాబిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంపై అత్యవసర విచారణ చేపట్టాలని సీజేఐ ధర్మాసనం ముందు ముఖేష్‌ తరఫు న్యాయవాది బృందాగ్రోవర్‌ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను ఆశ్రయించాలని సీజేఐ సూచించింది. ఫిబ్రవరి 1న మరణశిక్ష నేపథ్యంలో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని కోర్టు పేర్కొంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించడంపై న్యాయ విచారణ జరపాలని ముఖేష్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కాగా ఈ నెల 17న ముఖేష్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు.

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు తీహార్ జైలులో ఉరి తీయాలని ఢిల్లి కోర్టు ఇటీవలే కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం తీహార్ జైలు అధికారులు దోషులను ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే చెప్పాల్సిందిగా ప్రశ్నించారట. అందుకు దోషులు బదులేమీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారని అక్కడి జైలువర్గాలు వెల్లడించాయి. అంతేకాక వారంతా ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడుతుందన్న ధీమాతో ఉన్నట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నాయి.

2012, డిసెంబర్‌ 16న దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ కేసు.. ఇప్పుడు దోషులకు ఉరిశిక్ష పడబోతోంది. దేశ చరిత్రలోనే ఒకేసారి నలుగురిని ఉరితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్భయ దోషులను ఉరితీసేందుకు తేదీ దగ్గర పడుతుండటంతో తీహార్‌ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నలుగురు దోషుల జైలు గదుల వద్ద హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. జైలు గార్డుల పర్యవేక్షణలో ఈ నలుగురు దోషులను వేర్వేరు సెల్స్‌ లో ఉంచారు. ఉరిశిక్ష తేదీకి ముందే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీరట్‌ సెంట్రల్‌ జైలు తలారీ పవన్‌ కుమార్‌ తీహార్‌ జైలును సందర్శించి ఉరి ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

Next Story
Share it