ఢిల్లీ: నిర్భయ దోషి ముఖేష్‌ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను ఎలాంటి పరిశీలన లేకుండానే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ దాన్ని కొట్టి వేశారు. అక్కడి నుంచి ఆ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖకు పంపారు. కాగా ముఖేష్‌ పిటిషన్‌ను హోంశాఖ రాష్ట్రపతి పరిశీలనకు పంపనుంది. నిర్భయపై గ్యాంగ్‌రేప్‌ కేసులో ముఖేశ్‌ తీహార్‌ జైల్లో శిక్ష అనుభివిస్తున్నాడు. చివరి ప్రయత్నంలో భాగంగా ముఖేశ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశాడు. ముఖేష్‌ పిటిషన్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఒక వేళ రాష్ట్రపతి ముఖేష్‌ క్షమాబిక్ష పిటిషన్‌ను కొట్టేస్తే..ఈ కేసు.. ప్రధాన నిందితులైన అక్షయ్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్త, ముఖేష్‌ లకు ఈనెల 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష వేయనున్నారు. ఈ దోషులకు మరణ శిక్ష అమలు చేసేందుకు కసరత్తు మొదలైంది. ఒక్కో దోషి ఎంత బరువు ఉంటాడో అంత బరువున్న వస్తువులను ఉపయోగించి ఉరి ట్రయల్స్‌ వేయనున్నారు. ఈ ఉరిశిక్ష ట్రయల్స్‌ మూడో నెంబర్‌ కారాగారంలో నిర్వహించేందుకు సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ట్రయల్స్‌ లో జైలు సూపరింటెండెంట్‌, వర్క్‌ డిపార్ట్‌ మెంట్‌ అధికారులు, ఇతర అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది.

నిర్భయ దోషులు గడిచిన ఏడేళ్లలో జైల్లో 23 సార్లు నిబంధనలు అత్రిక్రమించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుతో నిందితులు నిద్ర కూడా పోవడం లేదని, వారిలో భయం కనిపిస్తోందని జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారిని అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉంచారు. జైల్లో కేటాయించిన పనులు చేసి నిందితులు ఇప్పటి వరకు రూ.1.37 లక్షలు సంపాదించారు. ఈ డబ్బును ఉరితీత అనంతరం నిందితుల తల్లిదండ్రులకు ఇవ్వనున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్