గుండెపోటుతో నిమ్స్ డాక్టర్ మీనా కుమారి మృతి
By సుభాష్ Published on 18 Jan 2020 11:11 AM GMT
లండన్ సదస్సులో నిమ్స్ డాక్టర్ మీనా కుమారి గుండెపోటుతో మృతి చెందారు. నిమ్స్ ఆస్పత్రి న్యూరో విభాగంలో సీనియర్ పిజీషియన్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ మీనా కుమారి అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి ఇటీవల లండన్ వెళ్లారు. అక్కడ జరిగిన సదస్సులో మాట్లాడుతుండగా ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే మీనా కుమారిని ఆస్పత్రికి తరలించారు. లండన్ వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో ఆమె మరణించారు. ఆమెను కాపాడడానికి వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని యూకే డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్ పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్ చేశారు.
గుండెకు శస్త్ర చికిత్స
మీనా కుమారికి గుండెకు సంబంధించి శస్త్ర చికిత్స నిర్వహించామని, మూడు స్టెంట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. కాగా, గుండె ఫెయిల్యూర్ ప్రభావం మెదడుపై పడటంతో ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకున్నారని వైద్యులు పేర్కొన్నారు. వైద్యురాలు మృతితో నిమ్స్ వైద్యులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
తమిళనాడు టూ హైదరాబాద్
తమిళనాడుకు చెందిన వైద్యురాలు మీనా కుమారి కుటుంబం కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. గాంధీ ఆస్పత్రి నుంచి ఎంబీబీఎస్, ఎండీ కోర్సులు పూర్తి చేశారు. గత 25 సంవత్సరాలుగా నిమ్స్ ఆస్పత్రిలో సేవలందిస్తూ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు.