ఏది ఏమైనా నా పెళ్లి అనుకున్న సమయానికి జరుగుతుంది: నిఖిల్

By సుభాష్  Published on  16 March 2020 8:04 AM GMT
ఏది ఏమైనా నా పెళ్లి అనుకున్న సమయానికి జరుగుతుంది: నిఖిల్

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన హీరోలు నిఖిల్ సిద్ధార్థ, నితిన్ తమ తమ భాగస్వాముల మెడలో ఏప్రిల్ 16న తాళి కట్టనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పెళ్లిళ్ల విషయమై కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఎక్కువ మంది వచ్చేలా పెళ్లిళ్లు చేసుకోకండని.. ఓ 200 మందిని మాత్రమే ఆహ్వానించండని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. మార్చి 31 తర్వాత ఏమైనా పెళ్లిళ్లు ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవాలని.. కొత్తగా ఎవరూ కళ్యాణ మండపాలను బుక్ చేసుకోకండని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు టాలీవుడ్ హీరోల పెళ్లిళ్ల విషయంలో సందిగ్ధత నెలకొంది. హీరో నిఖిల్ సిద్ధార్థ మాట్లాడుతూ.. ఏప్రిల్ 16న తన పెళ్లి తప్పకుండా జరుగుతుందని.. తామిద్దరం గుళ్ళోకి వెళ్లి కావాలంటే దండలు మార్చుకుని వస్తామని నిఖిల్ చెప్పుకొచ్చాడు. అనుకున్న సమయానికి తన పెళ్లి జరగడం పక్కా అని అంటున్నాడు.

నిఖిల్ సిద్ధార్థ డాక్టర్ పల్లవి ని వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండాలంటే పెళ్లిళ్ల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. తమ పెళ్లి పనులు కొనసాగుతాయని.. అనుకున్న ప్రకారమే పెళ్లి జరుగుతుందని నిఖిల్ తెలిపాడు. ఏప్రిల్ 16న తన పెళ్లి జరుగుతుందని .. ఎక్కువ మంది సమక్షంలో కాకున్నా ఇద్దరమే గుడికి వెళ్లి పెళ్లి చేసుకుని వస్తామని.. పెళ్లిని వాయిదా వేసుకోవాలన్న ఉద్దేశ్యం తమకు లేదన్నాడు నిఖిల్.

తాము ఇప్పటికే కళ్యాణ మండపాన్ని బుక్ చేసుకున్నామని.. ఇప్పుడు ఏమవుతుందో తమకు తెలీదన్నారు. వచ్చే వారంలో పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని.. దీంతో అందరికీ ఓ క్లారిటీ వస్తుందని అన్నాడు. ప్రస్తుతానికైతే శుభలేఖలు పంచడాన్ని ఆపివేశామన్నాడు. కొద్దిరోజుల క్రిందటే తాము పెళ్లి పత్రికలు పంచాలని అనుకున్నామని.. ఎప్పుడైతే కరోనా మహమ్మారి ప్రబలడం మొదలైందో అప్పటి నుండి తమకు టెన్షన్ మొదలైందని.. తన తల్లిదండ్రులకు కొద్దిరోజులు ఎదురుచూస్తే మంచిదని చెప్పానన్నాడు నిఖిల్. అది కరెక్ట్ డెసిషన్ అని తనకు ఇప్పుడు అనిపిస్తోందని చెప్పాడు నిఖిల్. పెళ్లిని బాగా గ్రాండ్ గా జరుపుకోవాలని అనుకున్నామని.. కానీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించాలని నిఖిల్ చెప్పుకొచ్చాడు.

ముందస్తు జాగ్రత్త గా ఇప్పటికే తాను బ్యాచిలర్ పార్టీ, ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లను రద్దు చేసుకున్నానని అన్నాడు నిఖిల్. కరోనా వైరస్ భయం అన్నది తమ కుటుంబ సభ్యుల మెదళ్లను తొలచివేస్తోందని.. కేవలం ఒక నెల దూరంలో పెళ్లి ఉండడం.. పరిస్థితుల్లో చాలా మార్పులు రావడంతో కుటుంబ సభ్యుల్లో కాస్త భయం నెలకొందని అన్నాడు. పెళ్లి పనులు కొన్ని జరుగుతూనే ఉన్నాయని.. షాపింగ్ ఇప్పటికే పూర్తీ అయిందని ఇక డిసైడ్ చేయాల్సింది పెళ్ళికి వచ్చే అతిథులు 200 మందా లేక 2000 మందా అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నాడు నిఖిల్.

నిఖిల్ డాక్ట‌ర్ ప‌ల్ల‌వితో నిశ్చితార్ధం జరుపుకున్నాడు. ఏప్రిల్ 16న వాళ్ల పెళ్లి ముహూర్తంగా నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం కరోనా వైరస్ ముప్పుని తీవ్రంగా ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం ఫంక్ష‌న్ హాల్స్ బుకింగ్స్‌పై క‌ఠినంగా వయవహరించింది. ఈ నేప‌థ్యంలో నిఖిల్ పెళ్ళి వాయిదా ప‌డుతుంద‌ని ప్ర‌చారం కొనసాగుతోంది. పెళ్లి వాయిదా పడే అవకాశాలే లేవని.. పెళ్లి ఆరోజు తప్పకుండా జరుగుతుందని నిఖిల్ తేల్చి చెప్పాడు.

Next Story