మీకు కరోనా ఉందనే భావించమన్న న్యూజిలాండ్ ప్రధాని
By సుభాష్
మీకు కరోనా వచ్చింది.. అప్పుడు మీరేం చేస్తారు. ఇంట్లో నుంచి బయటకు రారు, సొంత వాళ్లని ముట్టుకోరు. నా వల్ల ఇతర ప్రాణాలు పోతాయేమో అన్న భయంతో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలా ఉండండి అలాగే ఆలోచించండి అంటున్నారు న్యూజిలాండ్ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్. న్యూజిలాండ్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ఆ దేశ ప్రభుత్వం నెల రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైరస్ విషయంలో ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. కరోనా వైరస్ సోకితే ఎంత అప్రమత్తంగా ఉంటారో.. అంతే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. న్యూజిలాండ్‌లో కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు. అయితే, ఒకేసారి 50 మందికి ఈ వైరస్ సోకడం, మొత్తంగా 205 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత అర్ధరాత్రి నుంచే దేశంలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా కట్టడి చేసేందుకే నాలుగువారాల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని పార్లమెంట్‌లో ప్రకటించారు. దేశంలో ఇప్పటివరకు కొవిడ్-19తో ఒక్కమరణం కూడా సంభవించనప్పటికీ ముందు జాగ్రత్తలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. లాక్‌డౌన్ విధించిన ఈ నెలరోజుల్లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఈ సమయంలో ప్రతివ్యక్తి స్వతహాగా ఐసోలేషన్‌లో ఉండాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. పరిస్థితి చేయిదాటితే మాత్రం సైన్యాన్ని రంగంలోకి దించాల్సివస్తుందన్నారు. ఈ తాజా నిర్ణయంతో దేశంలోని మొత్తం 50లక్షల జనాభా పూర్తిగా వారి ఇళ్లకే పరిమితం అయ్యేఅవకాశం ఉంది. బుధవారం అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్ అమలులోకి వస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు ఇప్పటికే చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నాయి. 130కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్ కూడా 21రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.