నత్త జాతికి 'గ్రెటా' పేరు
By రాణి Published on 22 Feb 2020 11:39 AM GMTగ్రెటా థన్ బర్గ్.. ప్రముఖ వాతావరణ ఉద్యకారిణి..! స్వీడన్ కు చెందిన ఈ 16 ఏళ్ల బాలిక వాతావరణాన్ని కాపాడాలంటూ పెద్ద ఉద్యమమే చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కూడా వదలలేదు ఈ అమ్మాయి. వాతావరణం గురించి ట్రంప్ అసలు పట్టించుకోలేదని.. ఆయన తీరు అసలు బాగోలేదని చెప్పడంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది. 'హౌ డేర్ యు' అంటూ ఆమె చేసిన ప్రసంగం ఎందరినో మేల్కొల్పాయి.
అటువంటి గ్రెటాకు తాజాగా అరుదైన గౌరవం లభించింది. సరికొత్తగా కనుగొనబడిన నత్త జాతికి గ్రెటా పేరును పెట్టారు. పర్యావరణాన్ని కాపాడడానికి ఆమె చేస్తున్న పోరాటాన్ని దృష్టిలో పెట్టుకునే తాము కనుక్కొన్న నత్తకు గ్రెటా పేరు పెట్టామని అన్నారు రీసెర్చర్లు. క్రాస్పెడోట్రోపిస్ గ్రెటాథన్బర్గా (Craspedotropis gretathunberga) అని పేరు పెట్టారు. ఈ కొత్త నత్త 2 మిల్లీ మీటర్ల పొడవు, 1 మిల్లీ మీటర్ వెడల్పు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రే రంగులో టెంటకిల్స్ ఉన్నాయని.. అలాగే ఆ నత్తకు కాంకేవ్ షెల్ ఉన్నట్లు తెలిపారు. caenogastropods జాతికి చెందిన నత్త అని చెబుతున్నారు. బ్రూనే లోని కువాలా బెలాలాంగ్ ఫీల్డ్ స్టడీస్ సెంటర్ కు దగ్గరలోనే ఈ నత్తను కనుగొన్నారు.
రాత్రి పూట.. పచ్చని ఆకుల కోసం నదీ తీరం వెంబడి వెళుతున్న ఈ నత్తలను గమనించింది శాస్త్రవేత్తల బృందం. ఆ తర్వాత ఈ జాతి నత్తలకు గ్రెటా పేరును పెట్టారు. ప్రముఖ సైంటిస్ట్ జె.పి.లిమ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గ్రెటా చేస్తున్న పోరాటం అందరికీ ఆదర్శనీయమైందని.. పర్యావరణానికి ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయిందని.. ఇకపై అలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉందని గళమెత్తిన గ్రెటా పేరు పెట్టడం పట్ల ఆనందంగా ఉన్నామని లిమ్ చెప్పారు. అలాగే ఇప్పటి తరం గ్రెటాకు అండగా నిలవాలని సూచించారు.