ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన ఆర్నెల్లకే..

By రాణి  Published on  24 Feb 2020 12:12 PM GMT
ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన ఆర్నెల్లకే..

ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన ఆర్నెల్లకే ఆమె కన్న కలలన్నీ కల్లోలమయ్యాయి. అతడి వేధింపులను భరించలేని ఆమె ఆత్మహత్యే శరణ్యమనుకుంది. చేసేది లేక పురుగుల మందు తాగి అసువులు బాసిందో నవ వధువు. వివరాల్లోకి వెళ్తే..నిర్మల్ జిల్లాకు చెందిన కె.సునీత(22) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి బంధువుల ఇంట్లో పెరిగింది. ఉపాధికోసం బెంగళూరు వెళ్లిన సునీతకు..బుట్టాపూర్ కు చెందిన దుర్గం మహేశ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్లు ఇద్దరూ ప్రేమలో మునిగి తేలారు. తన ప్రేమలో సునీత పూర్తిగా మునిగిపోవడంతో..మహేశ్ ఆమెను శారీరకంగా లొంగదీసుకుని..స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సునీత తనను పెళ్లి చేసుకోమని మహేశ్ కు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా..స్పందించలేదు. ఆర్నెల్ల క్రితం తనకు న్యాయం చేయాలంటూ..మహేశ్ ఇంటి ఎదుట బైఠాయించిన సునీతకు పోలీసులు, గ్రామ పెద్దలు కలిసి మహేష్ తో పెళ్లి జరిపించారు. పెళ్లైన నాటి నుంచి మహేష్ తో పాటు అతడి తల్లి, బంధువులు కూడా సునీతను తీవ్రంగా వేధించసాగారు. రోజూ ఏదొక గొడవ పెట్టుకునేవారు. శనివారం ఆ గొడవలు ఇంకాస్త పెద్దవయ్యాయి.

మహేష్ తాగొచ్చి సునీతను దుర్భాషలాడటమే కాకుండా..కొట్టడంతో మనస్తాపానికి గురైన సునీత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగిన సునీతను నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..ఆదివారం ప్రాణాలు కోల్పోయింది. భర్త, అత్తమామలు, బంధువుల వేధింపులు భరించలేకే సునీత ఆత్మహత్య చేసుకుందని స్థానిక ప్రజా సంఘాలిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సునీత భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

Next Story
Share it