యూపీలో నేపాలి గ్యాంగ్‌ అరెస్ట్‌: పని మనుషులుగా పెట్టుకుంటే ముందు వారి గురించి తెలుసుకోండి: సీపీ సజ్జనార్‌

By సుభాష్  Published on  12 Oct 2020 8:09 AM GMT
యూపీలో నేపాలి గ్యాంగ్‌ అరెస్ట్‌: పని మనుషులుగా పెట్టుకుంటే ముందు వారి గురించి తెలుసుకోండి: సీపీ సజ్జనార్‌

ఇళ్లల్లో పని మనుషులుగా పెట్టుకునే ముందు వారి గురించి తెలుసుకోవాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. ఈనెల 6న రాయగుర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలోని బీఎంఆర్‌ హిల్స్‌లో యజమానులకు మత్తుమందు ఇచ్చి భారీగా నగదు, బంగారం దోచుకెళ్లింది ఈ నేపాలి గ్యాంగ్. ఈ గ్యాంగ్‌లో వినోద్‌ సాహి, నార్జింగ్‌ సాహీ, సీతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు సీపీ సజ్జనార్‌. ఈ చోరీ కేసులో నిందితులను వారం రోజుల్లోనే అరెస్టు చేశామని అన్నారు. బోర్‌వెల్‌ వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్పడిన నేపాల్‌ ముఠాలోని ముగ్గురు సభ్యులను ఆధీనంలోకి తీసుకున్నామని అన్నారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని, నిందితుల నుంచి రూ.5.20 లక్షలు, బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కాంట్రాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి భార్యకు మత్తమందు ఇచ్చి రూ.15 లక్షలు, బంగారం చోరీ చేశారు. అలాగే వాచ్‌మెన్‌, వంట మనుషులుగా ఇళ్లల్లోకి చేరి ఈ చోరీకి పాల్పడ్డారు.

బోర్‌వెల్‌ వ్యాపారి మధుసూదన్‌రెడ్డి ఇంట్లో నేపాల్‌ ముఠా పని మనుషులుగా చేరారని సజ్జనార్‌ తెలిపారు. యజమానులతో నమ్మకంగా ఉంటూ చోరీలు చేస్తున్నారన్నారు. ఆహార పదార్థాలలో మత్తుమందు కలిపి చోరీలకు పాల్పడుతున్నారని, ముఠాలో ప్రధాన నిందితుడు నేపాల్‌కు చెందిన నేత్రగా గుర్తించామని పేర్కొన్నారు.

నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన గాలించామని, వారిని ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే నిందితులను పట్టుకునేందుకు యూపీ పోలీసులు సహకరించారని, నేపాల్‌కు చెందిన ముఠా దేశంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిందని వెల్లడించారు.

Next Story
Share it