ఏపీ చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్ని బాధ్యతలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Nov 2019 4:41 PM ISTఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్నిని బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని ఛాంబర్‌లో ఇన్‌ఛార్జ్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సమయంలో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఇటీవలే బదిలీ చేసిన ఏపీ సర్కారు.. ఆయన స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో కొత్త సీఈవోగా నీలం సాహ్నిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీఎంవో స్పెషల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.
అయితే నీలం సాహ్ని ఏపీ ప్రభుత్వానికి తొలి మహిళా సీఎస్‌గా బాధ్యతలు తీసుకోవడంపై సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆమెకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ అధికార యంత్రాంగమంతా బృందస్ఫూర్తితో పనిచేసి సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా సాహ్ని చెప్పారు.