టాటా పగ్గాలు..మళ్లీ సైరస్ మిస్ర్తీ చేతికి
By రాణి Published on 18 Dec 2019 12:41 PM GMTముంబై : టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా సైరస్ మిస్ర్తీని తిరిగి నియమిస్తున్నట్లు ప్రకటించింది నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్ క్లాట్). సుమారు మూడేళ్ల తర్వాత మిస్ర్తీ మళ్లీ ఆ పదవిని చేపట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగుతున్న నటరాజన్ చంద్రశేఖర్ నియామకాన్ని ఎన్ క్లాట్ తప్పుబట్టింది. చంద్రశేఖర్ నియామకం చట్ట విరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది.
అయితే 2016 అక్టోబర్ 24వ తేదీన సైరస్ మిస్ర్తీని టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా తొలగించారు. అప్పటి నుంచి మిస్ర్తీ తనను కార్పొరేట్ నియమ, నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని ఆరోపిస్తూ న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఆ తర్వాత డిసెంబర్ 19వ తేదీన టాటా గ్రూప్ అన్ని సంస్థల డైరెక్టర్ గా మిస్ర్తీ రాజీనామా చేసి, 20న ఎన్ క్లాట్ ను ఆశ్రయించారు. సుమారు రెండేళ్లుగా పోరాడిన మిస్ర్తీకి తగిన ఫలితం దక్కింది. మిస్ర్తీని తొలగించడం చట్ట విరుద్ధమని ఎన్ క్లాట్ పేర్కొంది. మిస్ర్తీ పునర్నియామక ఉత్తర్వులు నాలుగు వారాల తర్వాత అమల్లోకి వస్తాయి కాబట్టి ఆ లోపు టాటా సంస్థ మిస్ర్తీని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమించకుండా దరఖాస్తు వేయచ్చని ఎన్ క్లాట్ తెలిపింది.